‘ఆ సమయంలో నా భార్యను చూసి భయపడ్డా’

16 Jul, 2018 10:56 IST|Sakshi

లండన్‌: గతేడాది తన బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో సెరెనా విలియమ్స్‌ చనిపోతుందేమోనని భయపడ్డానని ఆమె భర్త అలెక్సిస్‌ ఒహానియన్‌ తెలిపారు. ‘నా బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని రోజుల తర్వాత సర్జరీ చేయించుకునేందుకు వెళ్తున్న నా భార్య సెరెనాకు ముద్దిచ్చి గుడ్‌బై చెప్పాను. అప్పుడామె ప్రాణాలతో తిరిగొస్తుందో లేదో మాకెవరికీ తెలియదు. ఆమె బతకాలని కోరుకున్నాం.

ఆ తర్వాత 10 నెలలకే ఆమె వింబుల్డన్‌ ఫైనల్‌ చేరింది.  సెరెనా విలియమ్స్‌ త్వరలోనే ట్రోఫీ అందుకుంటుంది. ఒక గొప్ప ఘనతను మళ్లీ ఆమె ఇంటికి తిరిగి తీసుకురావాలని కోరుకుంటోంది’ అని ఒహానియన్‌ ట్వీట్‌ చేశాడు.  గతేడాది సెప్టెంబర్‌లో రక్తం గడ్డకట్టకుండా సెరెనా శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ సమయంలో సెరెనా ఆరోగ్యంపై తీవ్రంగా కలత చెందిన విషయాన్ని తాజాగా ఒహానియన్‌ స్పష్టం చేశారు. వింబుల్డన్‌ గ్రాండ్‌ స్లామ్‌ మహిళల సింగిల్స్‌లో సెరెనా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎంజెలిక్‌ కెర్బర్‌తో జరిగిన తుదిపోరులో సెరెనా ఓటమి చెందింది.

మరిన్ని వార్తలు