మోర్గాన్‌ మెరుపులు 

17 Feb, 2020 09:20 IST|Sakshi

22 బంతుల్లో 7 సిక్సర్లతో 57 నాటౌట్‌

అదరగొట్టిన బట్లర్, బెయిర్‌స్టో

చివరి టి20లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్‌ విజయం

2–1తో సిరీస్‌ సొంతం  

సెంచూరియన్‌: కొండంత లక్ష్యం కళ్ల ముందు ఉన్నా ఇంగ్లండ్‌ జట్టు అదరలేదు... బెదరలేదు. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో (22 బంతుల్లో 57 నాటౌట్‌; 7 సిక్స్‌లు)... దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (33 బంతుల్లో 66; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), బవుమా (24 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), డికాక్‌ (24 బంతుల్లో 35; ఫోర్, 4 సిక్స్‌లు), మిల్లర్‌ (20 బంతుల్లో 35 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టారు. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 226 పరుగులు చేసి గెలుపొందింది.
చదవండి: మయాంక్, పంత్‌ ఫిఫ్టీల ‘ప్రాక్టీస్‌’

ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (7; సిక్స్‌) విఫలమైనా... జోస్‌ బట్లర్‌ (29 బంతుల్లో 57; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెయిర్‌ స్టో (64; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ అవుటైనా... మోర్గాన్‌ మిగతా పనిని పూర్తి చేశాడు. మోర్గాన్‌ ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు ఉండటం విశేషం. 21 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన మోర్గాన్‌... గతంలో తన పేరిటే ఉన్న ఇంగ్లండ్‌ తరఫున ఫాస్టెస్ట్‌ ఫిప్టీ రికార్డును సమం చేశాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా మోర్గాన్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌తో రెండు నెలల దక్షిణాఫ్రికా పర్యటనను ఇంగ్లండ్‌ ఘనంగా ముగించింది. టెస్టు సిరీస్‌ను 3–1తో, టి20 సిరీస్‌ను 2–1తో గెల్చుకున్న ఇంగ్లండ్‌... వన్డే సిరీస్‌ను 1–1తో సమం చేసుకుంది. చదవండి: ఇంటా బయట గులాబీ బాట!  

>
మరిన్ని వార్తలు