వన్డే సిరీస్‌: ఆసీస్‌ ‘క్లీన్‌స్వీప్‌’

19 Jan, 2020 13:58 IST|Sakshi

బెంగళూరు : టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఓ వినూత్న సంఘటన చోటు చేసుకుంది. ఈ సిరీస్‌లో పర్యాటక ఆసీస్‌ జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ టాస్‌ ఓడిపోలేదు. మూడింటిలోనూ టాస్‌ గెలిచింది. తొలి రెండు వన్డేల్లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ జట్టు.. బెంగళూరు వేదికగా జరుగుతున్న వన్డేలో మాత్రం  తొలుత బ్యాటింగ్‌ వైపు మొగ్గుచూపింది. దీంతో ఓవరాల్‌గా మూడు వన్డేల్లోనూ టాస్‌ గెలిచి టీమిండియాను ఆసీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిందని నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ సారథి విరాట్‌ కోహ్లి టాస్‌ గెలవకపోవడం గమనార్హం.

మూడు వన్డేల సిరీస్‌ ప్రస్తుతం 1–1తో సమంగా ఉండగా ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టు ఖాతాలో సిరీస్‌ చేరుతుంది. రెండు జట్లు కూడా దాదాపు సమఉజ్జీలుగా కనిపిస్తుండటంతో పాటు భారీ స్కోర్ల వేదికపై మ్యాచ్‌ జరుగుతుండంతో మరో హోరాహోరీ పోరు జరగడరం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, భారత మాజీ క్రికెటర్‌ బాపు నాదకర్ణి మరణానికి సంతాపంగా టీమిండియా క్రికెటర్లు నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలోకి దిగారు.  ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ షమీ ఆరంభంలోనే గట్టి షాక్‌ ఇచ్చాడు. డేవిడ్‌ వార్నర్‌(3)ను వికెట్‌ పడగొట్టి టీమిండియా శిబిరంలో ఆనందం నింపాడు. దీంతో 18 పరుగులకే ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 

చదవండి: 
ఓటమిపై స్పందించిన స్టీవ్‌ స్మిత్‌

మరిన్ని వార్తలు