‘వీలైతే ధోని రికార్డు.. లేకుంటే కార్తీక్‌ సరసన’ 

13 Nov, 2019 17:37 IST|Sakshi

ఇండోర్‌: టీమిండియా టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని రికార్డుపై కన్నేశాడు. బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌లో సాహాను  పలు రికార్డులు ఊరిస్తున్నాయి. బంగ్లాదేశ్-భారత్‌ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లో అత్యధిక ఔట్లు చేసిన కీపర్‌గా ధోనీ(15) రికార్డు సాధించాడు. అందులో 12 క్యాచ్‌లు, మూడు స్టంపౌట్‌లు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో 12 ఔట్లతో దినేశ్‌ కార్తీక్‌ నిలిచాడు. ఇందులో 11 క్యాచ్‌లు 1 స్టంపౌట్‌ ఉన్నాయి.  సాహా ఇప్పటివరకూ బంగ్లాతో ఆడిన రెండు టెస్టుల్లో ఏడు ఔట్లు చేశాడు. అయితే ఈ రెండు టెస్ట్‌లలో అతను మరో ఎనిమిది ఔట్‌లను తన ఖాతాలో వేసుకుంటే ధోనీ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. లేకుంటే కనీసం ఐదు వికెట్లను సాధించిన కార్తీక్‌ సరసన నిలుస్తాడు. కాగా, గురువారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. 

ఇక ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాను రఫ్పాడించిన టీమిండియా.. అదేపనిలో బంగ్లాదేశ్‌ పని పట్టాలని భావిస్తోంది. బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్‌ చేసి చాంపియన్‌ షిప్‌లో ఎవరికీ అందని ఎత్తులో నిల్చోవాలని కోహ్లి సేన భావిస్తోంది. కాగా,  2000లో టెస్టు హోదా పొంది భారత్‌తోనే ఢాకాలో తొలి టెస్టు ఆడిన బంగ్లాదేశ్‌ ఇప్పటివరకు భారత్‌పై మాత్రం గెలవలేకపోయింది. గత 19 ఏళ్లలో భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య 9 టెస్టులు జరిగాయి. 7 టెస్టుల్లో భారత్‌ నెగ్గగా... రెండు టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. నిషేధం కారణంగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌... వ్యక్తిగత కారణాలతో తమీమ్‌... గాయం కారణంగా మష్రఫె ముర్తజాలాంటి మేటి ఆటగాళ్ల సేవలు బంగ్లాదేశ్‌ కోల్పోయిన నేపథ్యంలో టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా