సామ్సన్‌ వచ్చేశాడు..

10 Jan, 2020 18:38 IST|Sakshi

పుణె: భారత్‌తో  జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో శ్రీలంక టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ లసిత్‌ మలింగా ముందుగా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.  ఈ మ్యాచ్‌లో  శ్రీలంక రెండు మార్పులు చేసింది. ఏంజెలో మాథ్యూస్‌, సందకాన్‌లు తుది జట్టులోకి తీసుకుంది. ఇక భారత్‌ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. వికెట్‌ కీపర్‌ సంజా సామ్సన్‌కు తుది జట్టులో అవకాశం కల్పించారు. రిషభ్‌ పంత్‌ స్థానంలో సామ్సన్‌కు చోటిచ్చారు. 

2015లో చివరిసారి జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సామ్సన్‌.. ఆపై ఆడే అవకాశం దక్కలేదు. కొంత కాలంగా సామ్సన్‌ను జట్టులో ఎంపిక చేస్తున్నప్పటికీ తుది జట్టులో మాత్రం చోటివ్వడం లేదు. రిషభ్‌ పంత్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఎట్టకేలకు సామ్సన్‌కు మరోసారి ఆడే అవకాశం కల్పించింది. మరొకవైపు మనీష్‌ పాండే, చహల్‌లకు కూడా అవకాశం కల్పించారు. శివం దూబే స్థానంల పాండే రాగా, కుల్దీప్‌ స్థానంలో చహల్‌ను తుది జట్టులో ఎంపిక చేశారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి  2–0తో కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. తద్వారా 2020కి ఘనమైన విజయారంభం ఇవ్వాలని ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో ఏమాత్రం పోరాటమే ఇవ్వలేకపోయిన లంకపై భారత్‌ ఆడుతూ పాడుతూ చెమట చిందించకుండానే గెలిచింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌ ఇలా అన్ని రంగాల్లో భారత్‌దే ఆధిపత్యమైంది. ఈ విజయమిచ్చిన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతుంటే... ప్రత్యర్థి శ్రీలంక మాత్రం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. గత మ్యాచ్‌లో  లంకేయులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ మ్యాచ్‌లోనైనా సత్తాచాటి టీమిండియాను కట్టడి చేయాలని యోచిస్తోంది.

మరిన్ని వార్తలు