అక్కడ గ్యారంటీ ఏమీ లేదు: మయాంక్‌

14 Dec, 2019 13:45 IST|Sakshi

చెన్నై: టెస్టు ఫార్మాట్‌లో సక్సెస్‌ అయిన టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మయాంక్‌ అగర్వాల్‌ చోటు దక్కించుకోవడంతో ఇందులో కూడా సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా రెగ్యులర్‌ ఓపెనర్‌గా ఉన్న శిఖర్‌ ధావన్‌ గాయపడటంతో అతని స్థానంలో మయాంక్‌కు మేనేజ్‌మెంట్‌ అవకాశం కల్పించింది. మరి ఈ ఫార్మాట్‌లో ఎలా నెట్టుకొస్తారు అనే ప్రశ్నకు బేసిక్స్‌ పాటిస్తే సరిపోతుందని మయాంక్‌ పేర్కొన్నాడు.

‘మన గేమ్‌ ప్లాన్‌ సరిగా ఉంటే ఏ ఫార్మాట్‌ కష్టం కాదు. ఫార్మాట్‌కు తగ్గట్టు మైండ్‌ సెట్‌ను మార్చుకోవాలి. ఇక బేసిక్స్‌ అనేవి ఒకే రకంగా ఉంటాయి. గేమ్‌ పరిస్థితిన అర్థం చేసుకున్నప్పుడు ఫార్మాట్‌తో ఇబ్బంది ఉండదు. నేను ఎక్కడ క్రికెట్‌ ఆడిన జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడాలనే ఆలోచిస్తా. నా ప్రదర్శన జట్టుకు ఉపయోగపడితే చాలు. ఒకవేళ నేను బ్యాట్‌తో పరుగులు చేయని పక్షంలో కనీసం ఫీల్డింగ్‌లోనైనా ఆకట్టుకోవాలని అనుకుంటా. అందుకోసం మరింత శక్తిని కూడదీసుకుని శ్రమిస్తా’ అని అన్నాడు.

తాను ప్రతీ మ్యాచ్‌ను, ప్రతీ టోర్నమెంట్‌ను గెలవాలనే అనుకుంటానని, అలా ఆడితేనే మన మైండ్‌ సెట్‌ కూడా అందుకు సన్నద్ధమవుతుందన్నాడు. కాకపోతే వంద శాతం ఫలితం అనేది మన చేతుల్లో ఉండదన్నాడు. ఫలితంపై గ్యారంటీ ఏమీ ఉండదన్నాడు. కాగా, మనం పూర్తి స్థాయిలో ఆకట్టుకోవడానికి ముందు మైండ్‌ను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నాడు. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో  జరిగిన సిరీస్‌ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్‌.. 2019లో విశేషంగా రాణించాడు. ఈ సీజన్‌లో టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. మయాంక్‌ 754 టెస్టు పరుగులు సాధించాడు.

మరిన్ని వార్తలు