‘పది’పై టీమిండియా గురి

17 Jul, 2018 16:56 IST|Sakshi

లీడ్స్‌: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ గెలిచిన టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలిచి సమంగా ఉండటంతో ఆఖరి వన్డేకు ప్రాధాన్యత సంతరించుకుంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తొలుత భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ఈ మ్యాచ్‌లో భారత జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది.  కేఎల్‌ రాహుల్‌, సిద్దార్థ్‌ కౌల్‌, ఉమేశ్‌ యాదవ్‌లకు విశ్రాంతినిచ‍్చిన టీమిండియా..  వారి స్థానాల్లో దినేశ్‌ కార్తీక్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శార్దూల్‌ ఠాకూర్‌లను తుది జట్టులోకి తీసుకుంది. ఇక ఇంగ్లండ్‌ విషయానికొస్తే జాసన్‌ రాయ్‌ను రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితం చేసింది. అతని స్థానంలో జేమ్స్‌ విన్సేకి అవకాశం కల్పించింది.

తొలి వన్డేలో ఘన విజయం సాధించిన విరాట్‌ గ్యాంగ్‌.. రెండో వన్డేలో చివరి వరకూ పోరాడి ఓడింది.  రెండో మ్యాచ్‌లో పరాజయం మాత్రం భారత్‌ బలహీనతలను బయట పెట్టింది. ముఖ్యంగా మిడిలార్డర్‌ రాణించకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే వరుసగా పదో వన్డే సిరీస్‌ను సాధించిన ఘనతను సొంతం చేసుకుంటుంది. 2016లో  జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ జట్టు.. ఆ తర్వాత ఏ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌నూ కోల్పోలేదు. ఈ క్రమంలోనే వరుసగా పదో వన్డే సిరీస్‌ను గెలవాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగింది.

తుది జట్లు

భారత్‌; విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, దినేశ్‌ కార్తీక్‌, సురేశ్‌ రైనా, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, చాహల్‌

ఇంగ్లండ్‌; ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), బెయిర్‌ స్టో, జో రూట్‌, జేమ్స్‌ విన్సే, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, డేవిడ్‌ విల్లే, ప్లంకెట్‌, ఆదిల్‌ రషిద్‌, మార్క్‌ వుడ్‌

మరిన్ని వార్తలు