ధోని మరొకసారి..

10 Dec, 2017 14:54 IST|Sakshi

ధర్మశాల: శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ 113 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని(65;87 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో టీమిండియా పరువు  కాపాడుకుంది. శ్రీలంకతో తొలి వన్డేలో భారత్‌ 29 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ధోని మరొకసారి ఆపద్బాంధవుని పాత్ర పోషించాడు. 78 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించి పరువు నిలిపాడు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న ధోని.. ఆపై మరొక సిక్సర్‌, మరొక ఫోర్‌ కొట్టడంతో భారత జట్టు వంద పరుగులు దాటింది. ధోని సొగసైన ఇన్నింగ్స్‌తో ఇప్పటి వరకు భారత పేరిట ఉన్న ఓవరాల్‌ అత్యల్ప స్కోరు 54 పరుగుల నుంచి  టీమిండియా గట్టెక్కింది.

మరొకవైపు స్వదేశంలో భారత్‌ అత్యల్ప స్కోరు 78. దీన్ని నుంచి ధోని రక్షించడంతో మరొక చెత్త రికార్డును భారత్‌ తప్పించుకున్నట్లయ్యింది.ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే చుక్కెదురైంది. ఎనిమిది పరుగులకే శిఖర్‌ ధావన్‌(0), రోహిత్‌ శర్మ(2), దినేశ్‌ కార్తీక్‌(0)లు పెవిలియన్‌కు చేరడంతో భారత్‌ కష్టాల్లో పడింది. ఆపై మరో ఎనిమిది పరుగుల వ్యవధిలో మనీష్‌ పాండే(2), శ్రేయస్‌ అయ్యర్‌(9), కూడా అవుట్‌ కావడంతో భారత్‌ జట్టు 16 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆపై వెంటనే భువనేశ్వర్‌ కుమార్‌ డకౌట్‌ కావడంతో భారత్‌ 50 పరుగులకు చేస్తుందా అన్న అనుమానం కల్గింది. ఆ తరుణంలో ధోని బాధ్యతగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.  స్పిన్‌ బౌలర్‌ అయిన కుల్‌దీప్ యాదవ్‌‌(19)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 41 పరుగులు జత చేశాడు. కాగా, తన వన్డే కెరీర్‌లో 67వ హాఫ్‌ సెంచరీ సాధించిన ధోని చివరి వికెట్‌గా అవుటయ్యాడు. దాంతో భారత జట్టు 38.2 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.

మరిన్ని వార్తలు