టీ20 ప్రపంచకప్‌: హర్మన్‌ సేన కథ ముగిసింది!

23 Nov, 2018 08:30 IST|Sakshi

మళ్లీ అదే తడబాటు.. అదే పొరబాటు.. అప్పుడు.. ఇప్పుడు బ్యాటింగ్‌ వైఫల్యమే.. భారత మహిళల చిరకాల కోరిక తీరకుండా చేసింది. గ్రూప్‌ దశలో తిరుగులేని విజయాలు సాధించి.. ఊరించిన హర్మన్‌ సేన సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో చతికిలపడింది. నాడు 2017 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో టైటిల్‌ ముందు బోల్తాపడ్డ భారత మహిళలు.. నేడు టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో చేతులెత్తేశారు.

నార్త్‌ సాండ్‌(అంటిగ్వా) : ఇంగ్లండ్‌తో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ సేన ఇంగ్లండ్‌ బౌలర్ల దాటికి 19.3 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాట్స్‌వుమెన్స్‌లో స్మృతి మంధాన (34), జెమీమా రోడ్రిగ్స్‌(26)లవే టాప్‌ స్కోర్‌ సాధించారు. హార్డ్‌ హిట్టర్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ (16), కృష్ణమూర్తి (2), బాటియా (11)లు తీవ్రంగా నిరాశ పరిచారు.

ఇక ఈ మ్యాచ్‌కు సీనియర్‌ క్రికెటర్‌, హైదరబాద్‌ స్టార్‌ మిథాలీ రాజ్‌ దూరం కావడం కూడా భారత్‌ను దెబ్బతీసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్‌.. అమీ జోన్స్‌ (53), నటాలీ సివర్‌ (51)లు అర్ధసెంచరీలతో చెలరేగడంతో 17.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌.. ఆసీస్‌ను ఢీకొట్టనుంది. (చదవండి: మహిళా టీ20 ప్రపంచకప్‌: ఫైనల్లో ఆసీస్‌)

మరిన్ని వార్తలు