విశాఖ టెస్టుకు సర్వం సిద్ధం

30 Sep, 2019 19:17 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: భారత్- దక్షిణాఫ్రికాల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ బుధవారం నుంచి విశాఖలో ప్రారంభంకానుంది. నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగబోయే తొలి టెస్ట్‌కు సర్వం సిద్దమైంది. సోమవారం ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) నూతన అధ్యక్షుడు శరత్‌ చంద్రా రెడ్డి, కార్యదర్శి దుర్గారావు, కోశాధికారి గోపీనాథ్‌ రెడ్డి, తదితరులు స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్టేడియం సిబ్బందికి ఏసీఏ ఆధ్యక్షుడు శరత్‌ చంద్రా రెడ్డి సూచించారు. 

అనంతరం ఈ మ్యాచ్‌కు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనాలతో కలిసి ఏసీఏ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్షుడు శరత్‌ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘విశాఖలో జరిగే ఈ టెస్ట్ మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. అందుకోసం మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. మ్యాచ్‌ నిర్వహణ కోసం ఏడు కమిటీలను ఏర్పాటు చేశాం. వర్షాల వలన వెలుతురులేమి సమస్య తలెత్తినా ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో మ్యాచ్‌ను నిర్వహిస్తాం . ఒకవేళ వర్షం పడినా గంటలో తిరిగి మ్యాచ్‌ ప్రారంభమయ్యే విధంగా ఏర్పాట్లు చేశాం. 

స్టేడియం కెపాసిటీ 27,500 సీట్లు. ఇప్పటికే టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. స్టేడియంలో ఉన్న 20 గేట్లలో 12 గేట్లు తెరుస్తున్నాం.  విద్యార్థులు ఉచితంగా మ్యాచ్‌ చూసేందుకు గేట్‌ నెంబర్‌ 8 నుంచి లోపలికి వచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. స్కూలు, కాలేజ్‌ ఐడీ కార్డు చూపిస్తే చాలు. వెయ్యి మందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశాం. మ్యాచ్‌ సందర్బంగా ఎటువంటి ట్రాఫిక్‌ మళ్లింపులు లేవు’అని తెలిపారు.  

ఏసీఏను అభినందిస్తున్నా: విష్ణుకుమార్‌ రాజు
భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య విశాఖ వేదికగా జరగబోయే టెస్టు మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)ను మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అభినందించారు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తూ, సిబ్బందికి తగు సూచనలిస్తున్నారని కొనియాడారు. తొలిసారి విద్యార్థులకు ఉచితంగా మ్యాచ్‌ చూసే అవకాశం కల్పించిన నూతన ఏసీఏ వర్గానికి విష్ణుకుమార్‌ రాజు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

కాగా, ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. దీంతో మధ్యాహ్నం వరకు ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యారు. వర్షం ఆగిపోయాక మధ్యాహ్నం నుంచి టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నారు. రెండు గంటలకు పైగా సాగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో సారథి విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, హనుమ విహారి, మయాంక్‌ అగర్వాల్‌, రవీంద్ర జడేజాలు చెమట చిందించారు. 

మరిన్ని వార్తలు