లంక ఆటలు సాగలేదు...

25 Nov, 2017 00:28 IST|Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో  శ్రీలంక 205 ఆలౌట్‌ 

అశ్విన్‌కు 4 వికెట్లు 

ఆకట్టుకున్న ఇషాంత్, జడేజా  

రెండో టెస్టులో తొలిరోజే భారత్‌ ఆధిపత్యం, లంక కష్టాలు మొదలయ్యాయి. బౌలర్లు ఆరంభం నుంచే క్రమశిక్షణతో బౌలింగ్‌ చేయడంతో పర్యాటక బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడానికి కాదు... క్రీజులో నిలిచేందుకే ఆపసోపాలు పడ్డారు. మొత్తానికి పేస్‌ వికెటే అయినా... స్పిన్నర్లు దెబ్బతీశారు. పిచ్‌పై ఉన్న పచ్చిక ఆరంభంలో పేసర్లకు అనుకూలించినా... తర్వాత పిచ్‌ పూర్తిగా స్పిన్నర్ల వశమైంది. దీంతో లంక బ్యాట్స్‌మెన్‌ ఆటలు సాగలేదు. 

నాగ్‌పూర్‌: తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బౌలర్లు శ్రీలంకను గట్టిగా దెబ్బ కొట్టారు. ఏ దశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వకుండా పడగొట్టేశారు. శుక్రవారం ఇక్కడ మొదలైన రెండో టెస్టులో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లలో 205 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ కరుణరత్నే (147 బంతుల్లో 51; 6 ఫోర్లు), కెప్టెన్‌ చండిమాల్‌ (122 బంతుల్లో 57; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు సాధించారు. పేసర్‌ ఇషాంత్‌ (3/37) టాపార్డర్‌ను కూలిస్తే స్పిన్నర్లు అశ్విన్‌ (4/67), రవీంద్ర జడేజా (3/56) మిగతా బ్యాట్స్‌మెన్‌ పనిపట్టారు.  తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన భారత్‌ ఆట నిలిచే సమయానికి 8 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి 11 పరుగులు చేసింది. మురళీ విజయ్‌ (2 బ్యాటింగ్‌), పుజారా (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌ కె.ఎల్‌.రాహుల్‌ (7)ను గమగే బౌల్డ్‌ చేశాడు.  

ఇషాంత్‌ పంజా 
టాస్‌ నెగ్గిన లంక బ్యాటింగ్‌కే మొగ్గుచూపింది. శ్రీలంక ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఓపెనర్లు సమరవిక్రమ (13), కరుణరత్నే పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో ఆడారు. అదే పనిగా బంతుల్ని డిఫెన్స్‌గా ఆడిన ఈ జోడీ స్కోరుపై పెద్దగా దృష్టిపెట్టలేదు. అయితే ఈ అతి జాగ్రత్త ఎంతోసేపు కాపాడలేకపోయింది. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద ఇషాంత్‌ బౌలింగ్‌లో సమరవిక్రమ, స్లిప్‌లో పుజారాకు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన తిరిమన్నే (58 బంతుల్లో 9) కూడా జిడ్డుగా ఆడి చివరకు అశ్విన్‌ ఓవర్లో క్లీన్‌ బౌల్డయ్యాడు. శ్రీలంక 47/2 స్కోరు వద్ద లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది. 

ఆదుకున్న కరుణరత్నే, చండిమాల్‌
రెండో సెషన్‌లో లంక కాస్త పట్టు నిలుపుకుంది. కేవ లం రెండే వికెట్లు కోల్పోయిన పర్యాటక జట్టు 104 పరుగులు జతచేసింది. సెషన్‌ ఆరంభమైన కాసేపటికే మాథ్యూస్‌(10) జడేజా బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. తర్వాత కరుణరత్నేకు కెప్టెన్‌ చండిమాల్‌ జతయ్యాడు. ఇద్దరు నెమ్మదిగా ఆడుతూ జట్టు స్కోరును వందకు చేర్చారు. ఈ క్రమంలో కరుణరత్నే 132 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే ఇషాంత్‌ బౌలింగ్‌లో అతను ఎల్బీగా నిష్క్రమించాడు. దీనిపై ఓపెనర్‌ రివ్యూకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. త ర్వాత చండిమాల్‌కు డిక్‌వెలా జతయ్యాడు. ఇద్దరు మరో వికెట్‌ పడకుండా సెషన్‌ను ముగించారు. 

స్పిన్నర్లకు దాసోహం 
చివరి సెషన్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా భారత బౌలర్లకు దాసోహమయ్యారు. రెండో సెషన్‌లో కు దురుగా ఆడిన బ్యాట్స్‌మెన్‌ అనూహ్యంగా అశ్విన్, జడేజాల స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేశారు. ఫలితంగా లంక 54 పరుగులకే 6 వికెట్లను  కోల్పోయింది. రెండో సెషన్‌ నుంచి పోరాడిన కెప్టెన్‌ చండిమాల్‌ లంక ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. కానీ అండగా నిలచేవారే లేకపోవడంతో అతని అర్ధసెంచరీ జట్టు స్కోరును పెంచలేకపోయింది. డిక్‌వెలా (24) వికెట్‌తో ప్రారంభమైన పతనం 19 ఓవర్లలోనే పూర్తయింది. చండిమాల్‌ సహా షనక (2), పెరీరా (15), హెరాత్‌(4) స్పిన్‌ ద్వయానికి చిక్కారు. ఆ తర్వాత భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ మొదలైంది. కాసేపటికే రాహుల్‌(7) మళ్లీ తక్కువ స్కోరుకే తన వికెట్‌ పారేసుకున్నాడు. అయితే విజయ్, పుజారా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు.  

12   అన్ని ఫార్మాట్‌లలో కలిపి తిరిమన్నేను అశ్విన్‌ అవుట్‌ చేయడం ఇది 12వ సారి. అశ్విన్‌ తన కెరీర్‌లో ఎక్కువ సార్లు అవుట్‌ చేసిన బ్యాట్స్‌మన్‌ తిరిమన్నేనే కావడం విశేషం.  

స్కోరు వివరాలు 
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: సమరవిక్రమ (సి) పుజారా (బి) ఇషాంత్‌ శర్మ 13; కరుణరత్నే ఎల్బీడబ్ల్యూ (బి) ఇషాంత్‌ శర్మ 51; తిరిమన్నే (బి) అశ్విన్‌ 9; మాథ్యూస్‌ ఎల్బీడబ్ల్యూ (బి) జడేజా 10; చండిమాల్‌ ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్‌ 57; డిక్‌వెలా (సి) ఇషాంత్‌ శర్మ (బి) జడేజా 24; షనక (బి) అశ్విన్‌ 2; పెరీరా ఎల్బీడబ్ల్యూ (బి) జడేజా 15; హెరాత్‌ (సి) రహానే (బి) అశ్విన్‌ 4; లక్మల్‌ (సి) సాహా (బి) ఇషాంత్‌ శర్మ 17; గమగే నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (79.1 ఓవర్లలో ఆలౌట్‌) 205. 

వికెట్ల పతనం: 1–20, 2–44, 3–60, 4–122, 5–160, 6–165, 7–184, 8–184, 9–205, 10–205. 

బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 14–3–37–3, ఉమేశ్‌ యాదవ్‌ 16–4–43–0, అశ్విన్‌ 28.1–7–67–4, జడేజా 21–4–56–3. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) గమగే 7; విజయ్‌ బ్యాటింగ్‌ 2; పుజారా బ్యాటింగ్‌ 2; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (8 ఓవర్లలో వికెట్‌కు) 11. 

వికెట్ల పతనం: 1–7. 

బౌలింగ్‌: లక్మల్‌ 4–1–7–0, గమగే 4–2–4–1.

>
మరిన్ని వార్తలు