టీమిండియా అభిమానిపై నిషేధం

3 Feb, 2020 14:06 IST|Sakshi

మౌంట్‌మాంగని:  గతేడాది చివర్లో ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జోఫ్రా ఆర్చర్‌పై అసభ్యకర రీతిలో దూషించడంతో న్యూజిలాండ్‌కు చెందిన ఓ క్రికెట్‌ అభిమానిపై రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.  2019, నవంబర్‌లో న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ఆఖరి రోజు ఆటలో ఆర్చర్‌పై ఆక్లాండ్‌కు చెందిన ఒక అభిమాని వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా మరింత అవమానించేలా మాట్లాడాడు.  దాంతో తొలుత అరెస్ట్‌ చేయగా, అతనిపై రెండేళ్ల పాటు క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి స్టేడియాలకు రాకుండా నిషేధం విధించారు.  తాజాగా ఇదే తరహా ఘటన ఒకటి చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌-టీమిండియా జట్ల మధ్య జరిగిన చివరి టీ20లో ఒక  భారత అభిమాని అతి చేశాడు.  న్యూజిలాండ్‌లో ఉండే ఒక భారత అభిమాని కామెంటేటర్‌ను దూషించాడు. (ఇక్కడ చదవండి: బుమ్రా నయా వరల్డ్‌ రికార్డు)

గ్రౌండ్‌లో ఉన్న కామెంటేటర్‌ వద్దకు వెళ్లి తనకు ఒక ఆటోగ్రాఫ్‌ ఇవ్వాలంటూ సదరు అభిమాని కోరగా అందుకు అతను నిరాకరించాడు. దాంతో కామెంటేటర్‌పై దూషణకు దిగాడు. తనకు ఎందకు ఆటోగ్రాఫ్‌ ఇవ్వరంటూ వాదించాడు. దాంతో ఆ అభిమానిని సెక్యూరిటీ సిబ్బంది స్టేడియం బయటకు పంపించేశారు. అదే సమయంలో సదరు అభిమానిపై నిషేధం విధించారు. ఇక్కడ జరిగే ఏ మ్యాచ్‌లకు అతనికి అనుమతి ఇవ్వమని న్యూజిలాండ్‌ క్రికెట్‌ పబ్లిక్‌ ఎఫైర్స్‌ మేనేజర్‌ రిచర్డ్‌ బూక్‌ తెలిపారు. కేవలం కామెంటేటర్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతోనే ఈ స్టేడియం ప్రవేశానికి అనుమతి లేకుండా చేస్తున్నామన్నారు. ఒకవేళ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసుంటే శిక్ష వేరుగా ఉండేదని బూక్‌ పేర్కొన్నారు.  అయితే ఇక్కడ ఆ కామెంటేటర్‌ ఎవరు అనే విషయాన్ని రిచర్డ్‌ బూక్‌ రివీల్‌ చేయలేదు. (ఇక్కడ చదవండి: కోహ్లికి రెస్ట్‌.. రోహిత్‌కు ఛాన్స్‌)

మరిన్ని వార్తలు