కోల్‌కతాకే పట్టం

21 Dec, 2014 00:30 IST|Sakshi
కోల్‌కతాకే పట్టం

గంగూలీ జట్టుకు ఐఎస్‌ఎల్ టైటిల్
 ఫైనల్లో కేరళపై 1-0తో గెలుపు
 విజేతకు రూ. 8 కోట్ల ప్రైజ్‌మనీ

 
 ముంబై: రెండు నెలలకు పైగా సాగిన తొలి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)కు అట్లెటికో డి కోల్‌కతా థ్రిల్లింగ్ ముగింపునిచ్చిది. శనివారం డీవై పాటిల్ స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 1-0తో నెగ్గి ప్రారంభ ఐఎస్‌ఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఎక్స్‌ట్రా (90+5) సమయంలో సబ్‌స్టిట్యూట్ స్ట్రయికర్ మొహమ్మద్ రఫీఖ్ సాధించిన హెడర్ గోల్‌తో కోల్‌కతా ఐఎస్‌ఎల్ విజేతగా ఆవిర్భవించింది. ఇది లీగ్‌లో రఫీఖ్‌కు తొలి గోల్. విజేతగా నిలిచిన కోల్‌కతాకు రూ.8 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.
 
 రన్నరప్ కేరళ బ్లాస్టర్స్‌కు రూ. 4 కోట్ల చెక్‌ను అందించారు. అలాగే సెమీస్‌లో ఓడిన ఎఫ్‌సీ గోవా, చెన్నైయిన్ ఎఫ్‌సీకి తలా రూ. 1.5 కోట్లు దక్కాయి. అంతకుముందు ఇరు జట్ల మధ్య గోల్ కోసం తీవ్ర ప్రయత్నాలు సాగించాయి. పటిష్ట కోల్‌కతా డిఫెన్స్‌ను ఛేదించేందుకు కేరళ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చిట్టచివర్లో పోడీ అందించిన క్రాస్‌ను రఫీఖ్ మెరుపువేగంతో హెడర్ ద్వారా గోల్ చేసి దాదా జట్టును ఆనందంలో నింపాడు. ‘గోల్డెన్ బూట్’ అవార్డును ఎలనో(చెన్నైయిన్)కి ఇచ్చారు.
 

మరిన్ని వార్తలు