కోట్లు కుమ్మరించారు

21 Feb, 2017 07:35 IST|Sakshi
కోట్లు కుమ్మరించారు

అంచనా నిజమైంది. ఆట ఉంటే చాలు అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేకపోయినా.. కోట్లు కుమ్మరించడానికి తాము సిద్ధమేనని ఫ్రాంచైజీలు మరోసారి నిరూపించాయి. సోమవారం బెంగళూరులో జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)  పదో సీజన్‌ ఆటగాళ్ల వేలం పాటలో ఇంగ్లండ్‌ క్రికెటర్లతోపాటు ఇతర ఆటగాళ్లకు కాసుల పంట పడింది. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ జట్టు ఏకంగా రూ. 14 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది.

ఇంగ్లండ్‌కే చెందిన బౌలర్‌ టైమల్‌ మిల్స్‌ను రూ. 12 కోట్లకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది. హైదరాబాద్‌ రంజీ క్రికెటర్లు మొహమ్మద్‌ సిరాజ్‌ (రూ. 2 కోట్ల 60 లక్షలు), తన్మయ్‌ అగర్వాల్‌ (రూ. 10 లక్షలు)లను డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు దక్కించుకుంది. వేలంలో మొత్తం 357 మంది క్రికెటర్లు పాల్గొనగా... 66 మంది అమ్ముడుపోయారు. కనీసం రూ. కోటి అందుకోనున్న వారిలో 22 మంది క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెటర్లు ఇషాంత్‌ శర్మ, చతేశ్వర్‌ పుజారా, ఇర్ఫాన్‌ పఠాన్‌లతోపాటు ఐసీసీ బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఇమ్రాన్‌ తాహిర్‌ (దక్షిణాఫ్రికా)ను కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.

ఐపీఎల్‌ అంటే ఒకప్పుడు ఇంగ్లండ్‌ జట్టుకు అందనంత దూరం. మాకు జాతీయ జట్టే ముఖ్యం లీగ్‌ కాదంటూ వారంతా ప్రకటించుకోగా... అలా అయితే మాకూ మీ అవసరం లేదంటూ లీగ్‌ కూడా ఆ ఆటగాళ్లను పట్టించుకోలేదు. కానీ ఎట్టకేలకు పదో సీజన్‌కు వచ్చేసరికి ఇంగ్లండ్‌ ఆటగాళ్ల రాత మారిపోయింది. కేవలం ఆరుగురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఏకంగా రూ. 34.3 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తంగా ఐపీఎల్‌–2017 కోసం 357 మంది జాబితా నుంచి కేవలం 66 మంది మాత్రం లీగ్‌లో ఎంపికయ్యే అదృష్టం దక్కించుకున్నారు. కొన్ని అనూహ్య, మరికొన్ని అసాధారణ ఎంపికలతో ఈసారి కూడా ఐపీఎల్‌ వేలం అంచనాలకు అందకుండా సాగింది. ఇద్దరు అఫ్ఘానిస్థాన్‌ ఆటగాళ్లు కూడా లీగ్‌లో అడుగుపెడుతుండటం మరో విశేషం.

బెంగళూరు: ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ పంట పండింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పదో సీజన్‌ కోసం అతను రికార్డు మొత్తానికి అమ్ముడుపోయాడు. స్టోక్స్‌ను రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ రూ. 14 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో వేలంలో ఇది రెండో అత్యధిక మొత్తం కావడం విశేషం. గతంలో యువరాజ్‌ సింగ్‌కు ఢిల్లీ చెల్లించిన రూ. 16 కోట్లతో పోలిస్తే ఇది కోటిన్నర మాత్రమే తక్కువ. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఉన్న ఆటగాళ్లలో విరాట్‌ కోహ్లి (అధికారికంగా రూ. 15 కోట్లు) తర్వాత ఎక్కువ మొత్తం అందుకోబోయేది కూడా స్టోక్స్‌ కావడం విశేషం. ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ టైమల్‌ మిల్స్‌ కోసం కూడా బెంగళూరు జట్టు ఏకంగా రూ. 12 కోట్లు ఖర్చు చేసింది. మిషెల్‌ స్టార్క్‌ అనూహ్యంగా తప్పుకోవడంతో అతని స్థానంలో లెఫ్టార్మ్‌ పేసర్‌ కావాలని కోరుకున్న ఫ్రాంచైజీకి మిల్స్‌ రూపంలో ప్రత్యామ్నాయం కనిపిం చింది. టి20 స్పెషలిస్ట్‌గా గుర్తింపు ఉన్న ఇత ను, ఇంగ్లండ్‌ తరఫున 4 మ్యాచ్‌లే ఆడినా... ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతని బౌలింగ్‌ కోహ్లిని ఆకట్టుకోవడం మిల్స్‌కు కలిసొచ్చింది. ఐపీఎల్‌లో ఒక బౌలర్‌కు చెల్లిస్తున్న అత్యధిక మొత్తం కూడా ఇదే.

జాగ్రత్తగా...
గత ఏడాదిలాగే ఈసారి కూడా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం అత్యుత్సాహం ప్రదర్శించలేదు. పేరు ప్రఖ్యాతులకంటే కూడా తమ జట్టు అవసరం, ఆటగాడు నిర్వహించాల్సిన పాత్రను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వేలంలోకి వెళ్లాయి. కోల్‌కతా జట్టు అయితే తొలి 22 మంది ఆటగాళ్ల వరకు కనీసం స్పందించనే లేదు. బెంగళూరు మరింత అవకాశం ఉన్నా సరే... అందరికంటే తక్కువగా ఐదుగురు ఆటగాళ్లతోనే సరి పెట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌లో చురుగ్గా కొనసాగుతున్న పలువురు విదేశీ ఆటగాళ్లను, సీనియర్లను పట్టించుకోని ఫ్రాంచైజీలు... జట్టుకు బలం కాగలడనిపించిన భారత యువ ఆటగాళ్లపైనే ఎక్కు వ నమ్మకముంచడం విశేషం. రబడ (రూ. 5 కోట్లు), బౌల్ట్‌ (రూ. 5 కోట్లు), ప్యాట్‌ కమిన్స్‌ (రూ. 4.5 కోట్లు), క్రిస్‌ వోక్స్‌ (రూ. 4.2 కోట్లు), రషీద్‌ ఖాన్‌ (రూ. 4 కోట్లు) భారీ మొత్తం గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌కు రూ. 2 కోట్లు మాత్రమే దక్కాయి. 2016లో రూ. 8.5 కోట్లతో సంచలనం సృష్టించిన పవన్‌ నేగి ఈసారి రూ. 1 కోటి ధర పలికాడు.

ఆ ఇద్దరి కోసం...
స్టోక్స్‌ కనీస ధర రూ. 2 కోట్ల వద్ద అందరికంటే ముందుగా ముంబై బరిలో నిలిచింది. ఆ తర్వాత ముంబైతో పోటీ పడిన ఢిల్లీ దీనిని రూ. 10.5 కోట్ల వరకు తీసుకుపోయింది. ఈ సమయంలో అడుగు పెట్టిన సన్‌రైజర్స్‌ కూడా రూ. 13 కోట్ల వరకు ఆసక్తి చూపించింది. అయితే వెనక్కి తగ్గని పుణే చివరకు రూ. 14.5 కోట్లకు స్టోక్స్‌ను గెలుచుకుంది. రూ. 50 లక్షల కనీస ధరతో వచ్చిన మిల్స్‌ కోసం ముందుగా ముంబై బిడ్‌ వేసిం ది. ఆ తర్వాత పంజాబ్‌ కూడా పోటీ పడి ఒక దశలో ఆగిపోయింది. కోల్‌కతా కూడా రూ.10.5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడినా... చివరకు చాలెంజర్స్‌దే పైచేయి అయింది.

మరో వైపు 25 ఏళ్ల తమిళనాడు లెఫ్టార్మ్‌ పేసర్‌ తంగరసు నటరాజన్‌కు కూడా బిగ్‌ బొనాంజా లభించింది. కనీస ధర రూ. 10 లక్షలకు 30 రెట్లు ఎక్కువగా రూ. 3 కోట్లు చెల్లించి పంజాబ్‌ అతడిని సొంతం చేసుకుంది. రోజువారీ కూలీ కుమారుడు అయిన నటరాజన్‌ తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌తో వెలుగులోకి వచ్చాడు. అందులో ఒక మ్యాచ్‌ సూపర్‌ ఓవర్లో అతను ఆరు అద్భుతమైన యార్కర్లు వేయడం విశేషం. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించకుండా భారీ మొత్తం సొంతం చేసుకున్న భారత ఆటగాళ్లలో బాసిల్‌ తంపి (రూ. 85 లక్షలు), కృష్ణప్ప గౌతమ్‌ (రూ. 2 కోట్లు), అనికేత్‌ చౌదరి (రూ. 2 కోట్లు) ఉన్నారు.  

నంబర్‌వన్‌నూ పట్టించుకోలేదు!  
ఇమ్రాన్‌ తాహిర్‌... ప్రస్తుతం ఐసీసీ వన్డే, టి20 ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ బౌలర్‌. టి20 ఫార్మాట్‌లో 148 మ్యాచ్‌లు ఆడిన అతని కెరీర్‌ బౌలింగ్‌ రికార్డు చాలా మెరుగ్గా ఉంది. తన లెగ్‌స్పిన్‌తో మధ్య ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగల సామర్థ్యం ఉన్న తాహిర్‌ (దక్షిణాఫ్రికా) మూడు రోజుల క్రితమే కివీస్‌పై 5 వికెట్లు తీశాడు. అయితే ఇవేవీ తాహిర్‌పై ఫ్రాంచైజీలకు నమ్మకాన్ని పెంచలేకపోయాయి. రూ. 50 లక్షల కనీస ధరతో మళ్లీ మళ్లీ వేలంలోకి అతని పేరు వచ్చినా ఎవరూ స్పందించలేదు.  విదేశీ ఆటగాళ్ల వేలానికి ఇది అందరికంటే ఎక్కువగా ఆశ్చర్యపరచిన అంశం. మార్టిన్‌ గప్టిల్, జేసన్‌ రాయ్‌లాంటి హిట్టర్లను కూడా తొలి దశలో ఎవరూ తీసుకోలేదు కానీ ఆ తర్వాత మరోసారి వేలంలో పేరు వచ్చినప్పుడు వారు కనీస ధరకు అమ్ముడుపోయారు. రెండు సార్లు ప్రపంచ కప్‌ విజేతగా నిలిచిన జట్టు కెప్టెన్‌ స్యామీని కేవలం రూ.30 లక్షలకే పంజాబ్‌ సొంతం చేసుకోగా... ఈ రెండు సార్లు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ శామ్యూల్స్‌ను ఎవరూ పట్టించుకోలేదు. అంతర్జాతీయ క్రికెటర్లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నా ఐపీఎల్‌ లెక్కలోకి తీసుకోని విదేశీ క్రికెటర్లలో రాస్‌ టేలర్, అలెక్స్‌ హేల్స్, బెయిర్‌స్టో, జేసన్‌ హోల్డర్, తిసార పెరీరా, బెహర్దీన్, కుషాల్‌ పెరీరా, సాన్‌ట్నర్, గ్రాండ్‌హోమ్‌ ఉన్నారు.  

అఫ్ఘనాపాటీలు... 
అంతర్జాతీయ క్రికెట్‌లో తమ జట్టు ఇంకా ఓనమాల దశలోనే ఉన్నా ఇద్దరు అఫ్ఘనిస్తాన్‌ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకొని ఒక్కసారిగా తమ స్థాయిని పెంచుకున్నారు. 18 ఏళ్ల లెగ్‌స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ కోసం ఏకంగా రూ. 4 కోట్లు వెచ్చించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్, వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ నబీని రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. రషీద్‌ కోసం రైజర్స్‌తో పాటు ముంబై జట్టు కూడా వేలంలో పోటీ పడింది. ఏడాదిన్నర క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టి 18 వన్డేలు, 21 టి20లు ఆడిన రషీద్‌కు అప్పుడే ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ దక్కడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు. ఎనిమిదేళ్ల కెరీర్‌లో నబీ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో వీరిద్దరి రాక అప్ఘన్‌ జట్టు వేగంగా ఎదుగుతోందనడానికి సంకేతంగా చెప్పవచ్చు. వీరితో పాటు యూఏఈ ఆటగాడు చిరాగ్‌ సూరిని గుజరాత్‌ రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. డస్కటే (నెదర్లాండ్స్‌) తర్వాత అసోసియేట్‌ జట్ల నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన ఆటగాళ్లు వీరు ముగ్గురే.  

పాపం ఇషాంత్‌...  
‘ఇషాంత్‌ కనీస విలువ రూ. 2 కోట్లు చాలా ఎక్కువ’... ఐపీఎల్‌ వేలం సందర్భంగా అతని మాజీ సహచరుడు గంభీర్‌ చేసిన వ్యాఖ్య ఇది. భారత టెస్టు జట్టులో రెగ్యులర్‌ ఆటగాడైన ఇషాంత్‌... వన్డేలు, టి20ల్లో మాత్రం భాగం కాదు. అయితే టి20ల్లో అద్భుతమైన బౌలర్‌ కాకపోయినా... అతని అనుభవాన్ని బట్టి చూస్తే ప్రస్తుత భారత ఆటగాడిని ఫ్రాంచైజీలు ఏమాత్రం పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గంభీర్‌ మాటలను బట్టి చూస్తే అతనికి రూ. 2 కోట్లు ఇవ్వడం కూడా ఎక్కువ అని జట్లు భావించి ఉంటాయి. చాలా రోజులుగా భారత జట్టుకు దూరంగా ఉన్నా... తన కనీస ధరను రూ. 30 లక్షలుగా మాత్రమే నిర్ణయించుకున్న వరుణ్‌ ఆరోన్‌కు రూ. 2.8 కోట్ల భారీ మొత్తం దక్కడం విశేషం. ఆరోన్‌తో పోల్చుకుంటే తక్కువ ధర వద్ద మొదలైతే ఇషాంత్‌కు కూడా అవకాశం ఉండేదేమో! ఊహించినట్లుగానే మరో టెస్టు ఆటగాడు పుజారాను ఈసారి కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.

ఇక దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం ఆఖరిసారిగా భారత్‌కు ఆడిన ఇర్ఫాన్‌ పఠాన్‌పై కూడా ఎవరూ ఆసక్తి చూపించలేదు. దేశవాళీలో అప్పుడప్పుడు కొన్ని మెరుపులు ప్రదర్శిస్తూ... తనను తాను టి20 స్పెషలిస్ట్‌గా ఇర్ఫాన్‌ చూపించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వేలంలో అమ్ముడుపోకుండా నిరాశకు గురైన ఇతర భారత ఆటగాళ్లలో ప్రజ్ఞాన్‌ ఓజా, ముకుంద్, పర్వేజ్‌ రసూల్, ఆర్పీ సింగ్‌ ఉన్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించకపోయినా... ఇటీవల కొన్ని ప్రత్యేక ప్రదర్శనలతో వార్తల్లో నిలిచి లీగ్‌కు ఎంపికవుతామని ఆశించిన అనేక మంది కుర్రాళ్లపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. టి20ల్లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన మోహిత్‌ ఆహ్లావత్, 17 ఏళ్ల పృథ్వీ షా, రంజీ టాప్‌ స్కోరర్‌ ప్రియాంక్‌ ఈ జాబితాలో ఉన్నారు. 

ఎవరికెంత వచ్చిందంటే...