ఐర్లాండ్‌ ‘పవర్‌ ప్లే’ రికార్డు

16 Jan, 2020 12:58 IST|Sakshi

హోరాహోరీ పోరులో విండీస్‌కు షాక్‌

గ్రెనడా: ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఉత్సాహంలో టీ20 సిరీస్‌కు సిద్ధమైన వెస్టిండీస్‌కు షాక్‌ తగిలింది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో విండీస్‌ నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో చివరకు ఐర్లాండ్‌ విజయం సాధించగా, విండీస్‌ పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఐర్లాండ్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఐర్లాండ్‌ ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌(95; 47 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ కోల్పోగా, కెవిన్ ఒ బ్రయిన్‌(48; 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. (ఇక్కడ చదవండి: విండీస్‌ క్లీన్‌స్వీప్‌ )

ప్రధానంగా పాల్‌ స్టిర్లింగ్‌ బౌండరీల మోత మోగించి ఐర్లాండ్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.ఆరో ఓవర్‌ తొలి బంతికి సిక్స్‌ కొట్టిన స్టిర్లింగ్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే 20 బంతుల్లో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. మరొకవైపు ఒబ్రయిన్‌ సైతం బ్యాట్‌ ఝుళిపించడంతో ఐర్లాండ్‌ పవర్‌ ప్లేలో వికెట్‌ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. ఇది అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పవర్‌ ప్లే స్కోరుగా లిఖించబడింది.  పీర్రే వేసిన ఆరో ఓవర్‌లో 24 పరుగులు రాగా, అందులో 23 పరుగులు స్టిర్లింగ్‌ సాధించినవే కావడం విశేషం. ఇక మిగతా ఐర్లాండ్‌ ఆటగాళ్లలో గారెత్‌ డెలానీ(19), గారీ విల్సన్‌(17)లు రెండంకెల స్కోరును సాధించారు. దాంతో ఐర్లాండ్‌ 209 పరుగుల టార్గెట్‌ను విండీస్‌కు నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ 204 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. విండీస్‌ ఆటగాళ్లలో లెండి సిమ్మన్స్‌(22), ఎవిన్‌ లూయిస్‌(53; 29  బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), హెట్‌మెయిర్‌(28), పొలార్డ్‌(31), పూరన్‌(26), రూథర్‌ఫర్డ్‌(26)లు తలో చేయి వేసినా మ్యాచ్‌ను గెలిపించలేకపోయారు. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌లో ఐర్లాండ్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

మరిన్ని వార్తలు