అందుకే స్మిత్‌ను గేలి చేశా: ఇషాంత్‌

30 May, 2020 16:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫీల్డ్‌లో దిగిన క్రికెటర్లు మాటల ద్వారానే స్లెడ్జింగ్‌కు దిగడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. చేతలతో స్లెడ్జింగ్‌ చేసే సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఒకవేళ చేతల ద్వారా స్లెడ్జింగ్‌ చేస్తే అది ఒక క్రికెటర్‌ను గేలి చేసినట్లే అవుతుంది. ఇలా ఇషాంత్‌ శర్మ ఒకానొక సందర్భంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ను గేలి చేసిన సంగతి అందరికీ సుపరిచితమే. 2017లో బెంగళూరులో ఆసీస్‌తో జరిగిన టెస్టులో స్మిత్‌ను తన ముఖ కవలికల ద్వారా గేలి చేశాడు ఇషాంత్‌. ఇది క్రికెట్‌ అభిమానుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన. స్మిత్‌ను పదే పదే ఇలా స్లెడ్జ్‌ చేస్తూ ఇషాంత్‌ శర్మ పైచేయి సాధించే యత్నం చేశాడు. ఇషాంత్‌ అలా గేలి చేయడం, కోహ్లి పగలబడి నవ్వడం అప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. (వికెట్‌ కీపర్‌గా గిల్‌క్రిస్ట్‌.. ధోనికి నో చాన్స్‌!)

కాగా, ఆనాటి సంఘటనను తాజాగా మరోసారి గుర్తు చేసుకున్నాడు ఇషాంత్‌. అసలు అలా ఎందుకు చేశాడో చెప్పుకొచ్చాడు. స్మిత్‌ను అసౌకర్యానికి గురి చేయడంలో భాగంగానే అలా చేశానని ఇషాంత్‌ తెలిపాడు. ‘ అది మా ప్రణాళికలో భాగమే. స్మిత్‌ను క్రీజ్‌లో కుదురకోనీయకుండా చేయాలంటే మానసికంగా ఇబ్బంది పెట్టాలి అనేది ప్లాన్‌. అది ఒక క్లోజ్‌ గేమ్‌. నువ్వు బ్యాట్స్‌మన్‌ ఏకాగ్రతను దెబ్బతీయడానికి ఏమి చేయాలని చూస్తావో.. నేను కూడా దాదాపు అదే చేశా. స్మిత్‌ చాలాసార్లు బౌలర్లను విసిగిస్తాడు. క్రీజ్‌లో కుదురుకుంటే పరుగులు చేసుకుంటూ పోతాడు. మేము స్మిత్‌ను సాధ్యమైనంత త్వరగా ఔట్ చేస్తే అప్పుడు మేము గెలవడానికి అవకాశం ఉంటుంది. నేను కేవలం అతని ఏకాగ్రతను దెబ్బతీసి అసౌకర్యానికి గురి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక విరాట్‌ కోహ్లికి దూకుడు ఎక్కువ. దూకుడును కోహ్లి ఎక్కువ ఇష్టపడతాడు. ఇలా చేయొద్దని ఎప్పుడు చెప్పడు. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అది చెయ్యమని చెబుతాడు. అది కూడా నిషేధం పడకుండా ఉండేలా చూసుకోమని మాత్రమే చెబుతాడు’ అని టెస్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌తో షేర్‌ చేసుకున్నాడు ఇషాంత్‌. బీసీసీఐ టీవీ నిర్వహించిన ఓపెన్‌ నెట్స్‌  విత్‌ మయాంక్‌ కార్యక్రమంలో ఇషాంత్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు.(స్టోక్స్‌ కోసం ఏమైనా రూల్స్‌ మార్చారా?)

మరిన్ని వార్తలు