రాత్రంతా ఆస్పత్రిలోనే.. ఐనా సెంచరీ

18 May, 2019 19:53 IST|Sakshi

మ్యాచ్‌కు ముందు రోజు ఆస్పత్రిలో కన్నబిడ్డ చికిత్స పొందుతోంది. బిడ్డ బాగోగులు చూసుకుంటూ రాత్రంతా ఆస్పత్రిలోనే ఉన్నాడు. పాప ఆరోగ్యం కాస్త కుదుటపడిందని వైద్యులు చెప్పడంతో.. మ్యాచ్‌ మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతుందన్న సమయంలో మైదానానికి చేరుకున్నాడు. బేసిక్‌ వార్మప్‌ చేసి.. బ్యాట్‌ పట్టుకొని మైదానంలోకి దిగాడు. నిద్రను, బాధను దిగమింగుకొని జట్టుకు ఒంటి చేత్తో విజయాన్నందించి.. అభిమానుల మనసు గెలుచుకున్నాడు ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ జాసన్‌ రాయ్‌. 

నాటింగ్‌హామ్‌: పాకిస్తాన్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌ మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 3-0తో ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. భారీ ఛేజింగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టే మరోసారి పైచేయి సాధించింది. పాక్‌ నిర్దేశించిన 341 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య ఇంగ్లండ్‌ ఏడు వికెట్లు కోల్పోయి ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇంగ్లండ్‌ విజయంలో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ జాసన్‌ రాయ్‌(114; 89 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. రాయ్‌తో పాటు స్టోక్స్‌(71 నాటౌట్‌)రాణించడంతో ఇంగ్లండ్‌ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించిన జాసన్‌ రాయ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్టు లభించింది.

బహుమతి ప్రధానత్సోవం సందర్భంగా రాయ్‌ మాట్లాడుతూ..‘ మ్యాచ్‌కు ముందు రోజు కేవలం రెండు గంటలే నిద్ర పోయాను. మా పాప ఆరోగ్యం బాగోలేదు. తన బాగోగులు చూసుకుంటూ ఆస్పత్రిలోనే ఉన్నాను. అయితే మ్యాచ్‌ సమయానికి మైదానానికి వచ్చి బేసిక్‌ వార్మప్‌ చేసి బరిలోకి దిగాను. దేవుని దయతో నా పాప ఆరోగ్యంగానే ఉంది. పాక్‌పై ఆడిన ఈ ఇన్నింగ్స్‌ నాకు, నా కుటుంబానికి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది’అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. 

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది. బాబర్‌ అజామ్‌(115)క్లాసిక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. బాబర్‌కు తోడుగా ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌(57), హఫీజ్‌(59), మాలిక్‌(41)లు రాణించడంతో పాక్‌ భారీ స్కోర్‌ చేయగలిగింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో టామ్‌ కరన్‌ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య నామమాత్రమైన ఐదో వన్డే రేపు(ఆదివారం) జరగనుంది. 

>
మరిన్ని వార్తలు