నేను తిడతా... కాచుకోండి!

25 Mar, 2015 08:35 IST|Sakshi
నేను తిడతా... కాచుకోండి!

భారత్‌పై స్లెడ్జింగ్ చేస్తానంటున్న జాన్సన్
 
సిడ్నీ: భారత్‌తో జరిగే ప్రపంచకప్ సెమీస్‌లో కచ్చితంగా స్లెడ్జింగ్‌కు దిగుతానని ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ తేల్చి చెప్పాడు. ఇదంతా ఆటలో భాగమేనని సమర్థించుకున్నాడు. ‘వార్నర్ ఈసారి అలాంటి చేష్టలకు దిగనని చెప్పినట్టు విన్నాను. ఈసారి ఆ బాధ్యతను నేను తీసుకుంటాను. ఇదంతా ఆటలో భాగమే. పాక్‌తో క్వార్టర్స్‌లో వాట్సన్, వహాబ్ మధ్య మాటల యుద్ధం నిజంగా అసాధారణం. ఇద్దరూ ఏ స్థాయిలో ఆడారో చూశాం కదా’ అని జాన్సన్ గుర్తుచేశాడు. మరోవైపు ప్రపంచకప్‌లో పదే పదే ఆటగాళ్లతో ఘర్షణలకు దిగే వారిపై మ్యాచ్ నిషేధం విధిస్తామని గతంలోనే ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ హెచ్చరించారు.
 
‘స్నేహితులు’ ఒక్కటయ్యారు...

ఆసీస్, పాక్ మధ్య జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో మాటల యుద్ధానికి దిగిన పేసర్ వహాబ్ రియాజ్, బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ ట్విట్టర్ సాక్షిగా ఒక్కటయ్యారు. పాక్ బ్యాటింగ్ సమయంలో వహాబ్‌ను వాట్సన్ మాటలతో రెచ్చగొట్టాడు. ఆ తర్వాత బౌలింగ్‌కు దిగిన వహాబ్.. తన పదునైన బౌన్సర్లతో వాట్సన్ వెన్నులో వణుకుపుట్టిస్తూ రెచ్చగొట్టాడు.

ఇద్దరిపై ఐసీసీ జరిమానా కూడా విధించింది. ‘ఆ మ్యాచ్ అద్భుతంగా సాగింది. నీవు చాలా బాగా ఆడావు. సెమీస్‌లో ఇలాగే మెరుగ్గా ఆడాలని కోరుకుంటున్నాను’ అని వాట్సన్‌కు పాక్ పేసర్ ట్వీట్ చేశాడు. ‘వహాబ్ నుంచి ప్రత్యేక స్పెల్ వచ్చింది. నాకెలాంటి గాయాలు కానందుకు అదృష్టవంతుణ్ణి. నీపై నాకెలాంటి దురుద్దేశం లేదు’ అని వాట్సన్ స్పందించాడు.

>
మరిన్ని వార్తలు