తెలుగు టైటాన్స్‌లో కడప కుర్రాడి సింహగర్జన..!

22 Apr, 2019 13:22 IST|Sakshi
శివగణేష్‌ రెడ్డిని సన్మానిస్తున్న కబడ్డీ సంఘం ప్రతినిధులు

ప్రొకబడ్డీ లీగ్‌కు ఎంపికైన పెండ్లిమర్రి క్రీడాకారుడు

సత్కరించిన కబడ్డీ సంఘం ప్రతినిధులు

గ్రామీణ క్రీడ కబడ్డీ.. ఆధునిక హంగులు అద్దుకునిప్రొ కబడ్డీగా రూపుదిద్దుకుంది. మైదానంలో  క్రీడాకారుల సింహగర్జనలో కబడ్డీ కొత్త ఎత్తులను చూస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామసీమలోసరదాగా ఆడుకునే ఓ పల్లెటూరు కుర్రోడుమూల శివగణేష్‌రెడ్డి ఏకంగా తెలుగుటైటాన్స్‌జట్టుకు ఎంపికయ్యాడు. దేశానికి ప్రాతినిథ్యంవహించడమే తన లక్ష్యమని జూలైలో నిర్వహించే మ్యాచ్‌లకు సన్నద్ధమవుతున్నాడు..ఈ నేపథ్యంలో ఆయనపై ప్రత్యేక కథనం..

కడప స్పోర్ట్స్‌: వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన మోటార్‌మెకానిక్‌ రామసుబ్బారెడ్డి, నాగమల్లమ్మ దంపతుల కుమారుడైన మూల శివగణేష్‌రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. కమలాపురంలోని డిగ్రీ కళాశాలలో తృతీయ బీఏ చదువుతున్న ఈయన ప్రొ కబడ్డీ లీగ్‌ పోటీల్లో తెలుగుటైటాన్స్‌ జట్టుకు ఎంపికయ్యాడు. రాయలసీమ నుంచి ప్రొకబడ్డీకి ఎంపికైన తొలి క్రీడాకారుడుగా ఈయన చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ముగ్గురు క్రీడాకారులు మాత్రమే ప్రొ కబడ్డీలో వివిధ ప్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహించగా అందులో శివగణేష్‌రెడ్డి ఒకరు కావడం విశేషం.

మూడు సంవత్సరాల కాలంలోనే అసమాన్య ప్రతిభ..
తన సోదరుడు జనార్ధన్‌రెడ్డి కబడ్డీ క్రీడలో రాణిస్తుండటం చూడటం.. ఆయన  ప్రోత్సహించడంతో ఇంటర్‌ పూర్తయిన తర్వాత కబడ్డీ సాధన ప్రారంభించాడు. కబడ్డీ శిక్షకుడు టి. జనార్ధన్‌ ఆధ్వర్యంలో  ఆటలో ఓనమాలు దిద్దుకున్న ఈయన అనతికాలంలోనే పలు అవకాశాలను దక్కించుకున్నాడు. 2018లో నరసాపురంలో నిర్వహించిన జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ఏపీ జట్టుకు ప్రాతినిథ్యం వహించి రన్నరప్‌గా నిలిచారు. ఈ ఏడాది ముంబైలోని రోహులో నిర్వహించిన సీనియర్‌ నేషనల్స్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీల్లో సైతం ఏపీ నుంచి ప్రాతినిత్యం వహించాడు. గత సీజన్‌లో ప్రొ కబడ్డీ ఎంపికలకు వెళ్లిన ఈయన త్రుటిలో జట్టులో అవకాశం కోల్పోయాడు.   వైజాగ్‌లో నిర్వహించిన క్యాంపులో  ప్రతిభను గుర్తించిన తెలుగుటైటాన్‌ నిర్వాహకులు ఆల్‌రౌండర్‌గా అవకాశం కల్పించారు. ప్రొకబడ్డీ లీగ్‌ ఏడోసీజన్‌ కోసం ఇటీవల నిర్వహించిన వేలంలో జిల్లాకు చెందిన శివగణేష్‌రెడ్డిని రూ.6లక్షలకు టైటాన్స్‌ జట్టు సొంతం చేసుకుంది. ఈ పోటీలు జూలై నెలలో దేశవ్యాప్తంగా వివిధ వేదికల్లో నిర్వహించనున్నారు.   ఈయన ప్రస్తుతం విజయవాడలో ఇండియన్‌ కబడ్డీ సాయ్‌ కోచ్‌ పద్మజబాల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు.

సన్మానించిన కబడ్డీ సంఘం..
తెలుగుటైటాన్స్‌కు ఎంపికైన మూల శివగణేష్‌రెడ్డిని జిల్లా కబడ్డీ సంఘం ప్రతినిధులు సన్మానించారు. ఆయనకు పూలమాల వేసి శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌. గోవర్ధన్‌రెడ్డి, కార్యదర్శి చిదానంద్‌గౌడ్, కోశాధికారి, కోచ్‌ టి. జనార్ధన్, ఉపాధ్యక్షులు గోవిందు నాగరాజు, ఎం. సుకుమార్, కె.వి.శివప్రసాద్‌యాదవ్, జాయింట్‌ సెక్రటరీ ఎం. జనార్ధన్‌రెడ్డి, సభ్యులు టి.శ్రీవాణి, ఎం. ప్రసాద్, పి.జయచంద్ర, సుశీల, సీనియర్‌ క్రీడాకారులు పి.సురేంద్ర, విష్ణుప్రసాద్‌యాదవ్, చందముని రాకేష్, తేజరెడ్డి పాల్గొన్నారు.  

దేశానికి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యం
దేశానికి ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యం. సాధారణ  కుటుంబం నుంచి వచ్చిన నాకు వేలంలో  పలికిన ధర చూసి ఉక్కిరిబిక్కిరి అయ్యాను. నా ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పించిన తెలుగుటైటాన్స్‌కు ధన్యవాదాలు. అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సోదరుడు జనార్ధన్‌రెడ్డి, శిక్షకుడు జనార్ధన్, అసోసియేషన్‌ సభ్యులకు నా కృతజ్ఞతలు.     – మూల శివగణేష్‌రెడ్డి,     తెలుగు టైటాన్స్‌ జట్టు సభ్యుడు, కడప

మరిన్ని వార్తలు