కశ్యప్, శ్రీకాంత్ ఓటమి

12 Jun, 2014 05:29 IST|Sakshi

టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి తాన్వి లాడ్ సంచలనం సృష్టించింది. ఈ టోర్నీ బరిలోకి దిగిన ఏకైక భారత మహిళా షట్లర్ అయిన తాన్వి తన తొలి రౌండ్ మ్యాచ్‌లో 13-21, 21-11, 21-17 స్కోరుతో ప్రపంచ 18వ ర్యాంకర్ కిర్‌స్టీ గిల్మర్ (స్కాట్లాండ్)పై విజయం సాధించింది. భారత స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఈ టోర్నీలో పాల్గొనడం లేదు.
 
 సౌరభ్ వర్మ ముందంజ...
 పురుషుల విభాగంలో తెలుగు తేజాలు పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్‌లకు నిరాశే ఎదురైంది. సింగిల్స్‌లో 116వ ర్యాంక్‌లో ఉన్న రికి తకెషితా (జపాన్) చేతిలో కశ్యప్ 21-15, 23-25, 18-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. మరో మ్యాచ్‌లో మార్క్ వెబ్లర్ (జర్మనీ) 18-21, 21-13, 21-8తో శ్రీకాంత్‌ను చిత్తు చేశాడు. మరో ఆటగాడు గురుసాయి దత్ కూడా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. టకుమా యుదా (జపాన్) 21-10, 15-21, 21-13 తేడాతో సాయిదత్‌ను ఓడించాడు. అయితే మరో భారత ఆటగాడు సౌరభ్ వర్మ మాత్రం ముందంజ వేశాడు. తొలి రౌండ్‌లో అతను 19-21, 21-14, 22-20తో నాన్ వీ (హాంకాంగ్)పై గెలుపొంది రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.
 
 మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి 21-18, 21-16తో అయానే కురిహర-నారు షినోయా (జపాన్)పై, మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విన్-తరుణ్ కోన జంట 18-21, 21-18, 21-17తో పీటర్ కస్బర్-ఇసాబెల్ హెట్రిచ్ (జర్మనీ)పై విజయం సాధించి ముందంజ వేశారు.
 

>
మరిన్ని వార్తలు