కశ్యప్‌ శుభారంభం

20 Apr, 2017 01:39 IST|Sakshi
కశ్యప్‌ శుభారంభం

చాంగ్‌జూ (చైనా): ఈ ఏడాది తాను బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌ చైనా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ పారుపల్లి కశ్యప్‌ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన కశ్యప్‌... బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో 21–16, 21–17తో సుపన్యు అవింగ్‌సనోన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందాడు. నాలుగేళ్ల క్రితం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఆరో స్థానానికి చేరిన కశ్యప్‌ ఆ తర్వాత గాయాల కారణంగా వెనుకబడిపోయాడు. ప్రస్తుతం అతను 104వ ర్యాంక్‌లో ఉన్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ కియావో బిన్‌ (చైనా)తో కశ్యప్‌ ఆడతాడు. మరో రెండో రౌండ్‌ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన హర్షీల్‌ డాని 21–16, 22–20తో యాన్‌ రున్‌జి (చైనా)పై విజయం సాధించాడు.

మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. బరిలో దిగిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు చుక్కా సాయి ఉత్తేజిత రావు, శ్రీకృష్ణప్రియ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. సాయి ఉత్తేజిత 4–21, 21–13, 12–21తో లీ వెన్‌మీ (చైనా) చేతిలో, శ్రీకృష్ణప్రియ 18–21, 11–21తో లీ యున్‌ (చైనా) చేతిలో ఓడిపోయారు.

మరిన్ని వార్తలు