తెలంగాణకు మిశ్రమ ఫలితాలు

15 Feb, 2017 12:33 IST|Sakshi
తెలంగాణకు మిశ్రమ ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయి ఖేలో ఇండియా బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గచ్చిబౌలిలో జరుగుతోన్న ఈ పోటీల్లో అండర్‌–14 బాలబాలికల విభాగాల్లో గెలుపొందిన తెలంగాణ... అండర్‌–17 విభాగాల్లో ఓటమి పాలైంది.  మంగళవారం జరిగిన అండర్‌–14 బాలుర మ్యాచ్‌లో తెలంగాణ 86– 33తో కర్ణాటక జట్టుపై గెలుపొందగా... బాలికల విభాగంలో 28–4తో జమ్ము, కశ్మీర్‌ జట్టును ఓడించింది. అండర్‌–17 విభాగంలో జరిగిన బాలికల మ్యాచ్‌లో తెలంగాణ 7–40తో కేరళ చేతిలో, బాలుర విభాగంలో 31–66తో రాజస్థాన్‌ చేతిలో ఓటమి పాలైంది.

జిమ్నాస్టిక్స్‌లో రాణించిన నిఖిత
ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా జిమ్నాస్టిక్స్‌ ఈవెంట్‌లో రాష్ట్రానికి చెందిన నిఖితా గౌడ్‌ అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంది. టేబుల్‌ వాల్ట్, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ విభాగాల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించింది. టేబుల్‌ వాల్ట్‌ ఈవెంట్‌లో 9.07 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచిన నిఖిత... ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ విభాగంలో 11.60 స్కోరుతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ విభాగంలో రాష్ట్రానికే చెందిన జి. స్వాతి కూడా 11.34 పాయింట్లు స్కోరు చేసి ఐదోస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది.

జాహ్నవి, భార్గవిల ముందంజ
బ్యాడ్మింటన్‌ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు జాహ్నవి, భార్గవి, సాహస్, రాజ్‌ ముందంజ వేశారు. అండర్‌–14 బాలుర సింగిల్స్‌ విభాగంలో రాజ్‌ (తెలంగాణ) 15–12, 15–9తో దేవహిత్‌ శర్మపై గెలుపొందగా... మరో సాహస్‌ కుమర్‌కు వాకోవర్‌ లభించింది. ఆంధ్రకు చెందిన సంజీవ రావు 15–11, 15–6తొ హర్షిక్‌ (ఉత్తరాఖండ్‌)పై విజయం సాధించాడు. బాలికల విభాగంలో కె. భార్గవి (తెలంగాణ) 21–16, 21–8తో సరోజ్‌ఖాన్‌ (తిరుపతి)పై, ఎన్‌. జాహ్నవి (ఏపీ) 21–16, 11–21, 21–8తో సాహు (గుజరాత్‌)పై గెలుపొందారు.

మరిన్ని వార్తలు