శ్రీకాంత్‌కు చుక్కెదురు

29 Sep, 2016 00:49 IST|Sakshi
శ్రీకాంత్‌కు చుక్కెదురు

సియోల్: రియో ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న రెండో టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 10-21, 24-22, 17-21తో ప్రపంచ 20వ ర్యాంకర్ వోంగ్ కింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు.
 
  55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో తడబడిన శ్రీకాంత్ రెండో గేమ్‌లో ఒక మ్యాచ్ పాంట్‌ను కాపాడుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో శ్రీకాంత్ 17-16తో ఆధిక్యంలో ఉన్నా వరుసగా ఐదు పాయింట్లు సమర్పించుకొని ఓటమిని మూటగట్టుకున్నాడు. మరోవైపు క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడిన మరో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ 22-20, 10-21, 13-21తో నాలుగో సీడ్ తియాన్ హువీ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు.
 
 తొలి గేమ్‌ను నెగ్గిన కశ్యప్ ఆ తర్వాత నిలకడగా రాణించడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయిగ్‌లో మూడు గేమ్‌లపాటు సాగిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన కశ్యప్ అదే ఫలితాన్ని మెయిన్ ‘డ్రా’లో పునరావృతం చేయలేకపోయాడు. ప్రపంచ 39వ ర్యాంకర్ వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)తో జరిగిన మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 31వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 23-21, 17-21, 15-21తో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో తన్వీ లాడ్ 18-21, 21-13, 18-21తో అనా థి మాడ్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది.
 
 మరోవైపు భారత్‌కే చెందిన భమిడిపాటి సాయిప్రణీత్, అజయ్ జయరామ్ శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో హైదరాబాద్ ఆటగాడు, ప్రపంచ 35వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21-13, 12-21, 21-15తో ప్రపంచ 26వ ర్యాంకర్ సు జెన్ హావో (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించగా... బుధవారం తన 29వ జన్మదినాన్ని జరుపుకున్న ప్రపంచ 18వ ర్యాంకర్ అజయ్ జయరామ్ 23-21, 21-18తో ప్రపంచ 22వ ర్యాంకర్ జియోన్ హ్యుక్ జిన్ (కొరియా)ను ఓడించాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆరో సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో సాయిప్రణీత్; హువాంగ్ యుజియాంగ్ (చైనా)తో జయరామ్ తలపడతారు.
 

మరిన్ని వార్తలు