బెంగళూరు బతికిపోయింది

10 May, 2016 08:02 IST|Sakshi
బెంగళూరు బతికిపోయింది

ఓటమికి చేరువగా వచ్చిన బెంగళూరు అదృష్టవశాత్తూ గట్టెక్కింది. జట్టు బౌలర్ క్రిస్ జోర్డాన్ ఒత్తిడిని తట్టుకొని బౌండరీ రాకుండా ఆఖరి బంతిని విసరడంతో ఆ జట్టుకు ఒక్క పరుగుతో విజయం దక్కింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా స్టొయినిస్ 2 పరుగులే తీయగలిగాడు. చివరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సిన స్థితిలో పంజాబ్ బ్యాట్స్‌మెన్ స్టొయినిస్, బెహర్దీన్ 15 పరుగులు తీయగలిగినా పంజాబ్‌ను ఓటమి నుంచి రక్షించలేకపోయారు. అంతకుముందు చహల్ బౌలింగ్ ప్రదర్శన ఆర్‌సీబీని ఆదుకుంది.
 
ఒక్క పరుగుతో విజయం
* రాణించిన డివిలియర్స్, చహల్
* చివరి బంతికి ఓడిన పంజాబ్
* విజయ్ మెరుపులు వృథా

మొహాలీ: ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కీలక విజయాన్ని అందుకుంది. మరోసారి బౌలింగ్ వైఫల్యం జట్టును దెబ్బ తీసేలా కనిపించినా, ఎట్టకేలకు గట్టెక్కింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు పరుగు తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. డివిలియర్స్ (35 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, రాహుల్ (25 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్), సచిన్ బేబీ (29 బంతుల్లో 33; 1 ఫోర్) రాణించారు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులే చేయగలిగింది. మురళీ విజయ్ (57 బంతుల్లో 89; 12 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగగా, స్టొయినిస్ (22 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. రెండు కీలక వికెట్లు తీసిన వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
 
చెలరేగిన డివిలియర్స్...
వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రాహుల్, కోహ్లి (21 బంతుల్లో 20; 2 ఫోర్లు) బెంగళూరుకు శుభారంభం అందించారు. ఒకవైపు కోహ్లి సంయమనంతో ఆడగా, మరోవైపు నుంచి రాహుల్ చెలరేగిపోయాడు. స్టొయినిస్ వేసిన నాలుగో ఓవర్లో అతను మూడు ఫోర్లు, 1 సిక్సర్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. ఈ జోరులో పవర్‌ప్లేలో ఆర్‌సీబీ 56 పరుగులు చేసింది. 11 పరుగుల వద్ద స్టొయినిస్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి దానిని పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు.

కరియప్ప వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో బెంగళూరు వేగానికి బ్రేక్ వేసింది. మూడో బంతికి రాహుల్‌ను బౌల్డ్ చేసిన కరియప్ప, మరో రెండు బంతుల తర్వాత కోహ్లిని పెవిలియన్ పంపించాడు. మరుసటి ఓవర్లోనే వాట్సన్ (1) కూడా వెనుదిరిగాడు. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన డివిలియర్స్ ఈ దశలో తన ధాటిని ప్రదర్శించాడు. సందీప్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన అతను, మోహిత్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సందీప్ తర్వాతి ఓవర్లో కూడా మళ్లీ సిక్స్, ఫోర్ కొట్టిన తర్వాత మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. డివిలియర్స్‌కు సచిన్ బేబీ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 55 బంతుల్లోనే 88 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్లో బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. తొలి 10 ఓవర్లలో 73 పరుగులు చేసిన కోహ్లి సేన, తర్వాతి 10 ఓవర్లలో 102 పరుగులు సాధించింది.
 
విజయ్ ఒంటరి పోరు...
పంజాబ్ ఇన్నింగ్స్‌ను విజయ్ దూకుడుగా ఆరంభించగా, ఆమ్లా (20 బంతుల్లో 21; 2 ఫోర్లు) కొద్ది సేపు అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 33 బంతుల్లో 45 పరుగులు జోడించిన అనంతరం ఆమ్లాను వాట్సన్ అవుట్ చేశాడు. విజయ్‌కు సాహా (13 బంతుల్లో 16; 1 ఫోర్) కూడా సహకరించడంతో రెండో వికెట్‌కూ 32 బంతుల్లో 43 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. 10 ఓవర్లు ముగిసే సరికి కింగ్స్ స్కోరు 83 పరుగులకు చేరింది. అయితే 11వ ఓవర్లో పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది.

సాహా రనౌట్ కాగా, మిల్లర్(0) స్టంపౌట్ అయి వెనుదిరిగాడు. మరోవైపు 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న విజయ్, ఆ తర్వాత మరింత బాధ్యతగా ఆడాడు. అబ్దుల్లా ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన విజయ్, చహల్ ఓవర్లో మరో రెండు బౌండరీలు రాబట్టాడు. విజయ్, స్టొయినిస్ నాలుగో వికెట్‌కు ఆరు ఓవర్లలో 51 పరుగులు జత చేసిన తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించి విజయ్ వెనుదిరగడం పంజాబ్ అవకాశాలను దెబ్బ తీసింది.
 
స్కోరు వివరాలు:-
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) విజయ్ (బి) కరియప్ప 20; రాహుల్ (బి) కరియప్ప 42; డివిలియర్స్ (సి) కరియప్ప (బి) సందీప్ 64; వాట్సన్ (బి) అక్షర్ 1; సచిన్ బేబీ (రనౌట్) 33; హెడ్ (సి) విజయ్ (బి) సందీప్ 11; బిన్నీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 175.
వికెట్ల పతనం: 1-63; 2-64; 3-67; 4-155; 5-174; 6-175.
బౌలింగ్: సందీప్ 4-0-49-2; అనురీత్ 3-0-15-0; మోహిత్ 3-0-33-0; స్టొయినిస్ 3-0-35-0; అక్షర్ పటేల్ 4-0-27-1; కరియప్ప 3-0-16-2.
 
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) బిన్నీ (బి) వాట్సన్ 21; విజయ్ (సి) చహల్ (బి) వాట్సన్ 89; సాహా (రనౌట్) 16; మిల్లర్ (స్టంప్డ్) రాహుల్ (బి) చహల్ 0; స్టొయినిస్ (నాటౌట్) 34; బెహర్దీన్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174.
వికెట్ల పతనం: 1-45; 2-88; 3-88; 4-139.
బౌలింగ్: బిన్నీ 2-0-16-0; చహల్ 4-0-30-1; జోర్డాన్ 4-0-52-0; వాట్సన్ 4-0-22-2; ఆరోన్ 3-0-25-0; అబ్దుల్లా 3-0-26-0.

మరిన్ని వార్తలు