ఓహో లోకేశ్‌ రాహుల్‌

7 May, 2018 05:00 IST|Sakshi
ముజీబ్‌, రాహుల్‌

పంజాబ్‌ను గెలిపించిన ఓపెనర్‌

బౌలింగ్‌లో ముజీబ్‌ మాయాజాలం

రాజస్తాన్‌కు ఆరో ఓటమి

కింగ్స్‌ ఎలెవన్‌ మొదట స్పిన్‌తో కట్టేసింది. తర్వాత బ్యాటింగ్‌లో చితగ్గొట్టింది. దాని పంజా(బ్‌) ధాటికి రాజస్తాన్‌ రాయల్స్‌ నిలువలేకపోయింది. ముజీబ్‌ తన స్పిన్‌ మ్యాజిక్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగా... తర్వాత బ్యాటింగ్‌లో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌  కడదాకా నిలిచి గెలిపించాడు. జట్టును ప్లే–ఆఫ్‌కు చేరువ చేశాడు.  

ఇండోర్‌: పంజాబ్‌ ఆల్‌రౌండ్‌ షోకు రాజస్తాన్‌ రాయల్స్‌ చేతులెత్తేసింది. మొదట ముజీబుర్‌ రెహమాన్‌ (3/27) ముచ్చెమటలు పట్టించగా, లోకేశ్‌ రాహుల్‌ (54 బంతుల్లో 84 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరోచిత ప్రదర్శనతో గెలిపించాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్‌  మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో రాయల్స్‌పై నెగ్గింది. తొలుత రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసింది.

బట్లర్‌ (39 బంతుల్లో 51; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ముజీబ్‌ 3, ఆండ్రూ టై 2 వికెట్లు తీశారు. తర్వాత పంజాబ్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసి గెలిచింది. కరుణ్‌ నాయర్‌ (23 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఈ సీజన్‌లో రాజస్తాన్‌కిది ఆరో ఓటమి కాగా, పంజాబ్‌ ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

బట్లరే బాగా ఆడాడు...
రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ ఏ దశలోనూ భారీ స్కోరు చేస్తుందనిపించేలా సాగలేదు. ఆ జట్టులో బట్లర్‌ ఒక్కడే నిలిచాడు. మిగిలిన వారంతా ఇలా వచ్చి అలా అడేసిపోయారంతే. సంజు శామ్సన్‌ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ గోపాల్‌ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు) ఓ చెయ్యేశారు. టాస్‌ నెగ్గిన పంజాబ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ను బట్లర్, షార్ట్‌ ప్రారంభించారు.

కానీ ఆట మొదలైన మూడో బంతికే షార్ట్‌ (2), కాసేపటికి కెప్టెన్‌ రహానే (5) నిష్క్రమించారు. తర్వాత శామ్సన్‌ అండతో బట్లర్‌ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. దీంతో పది ఓవర్ల దాకా మరో వికెట్‌ కోల్పోకుండా 81 పరుగులు చేసింది. కానీ ఆ మరుసటి ఓవర్లోనే శామ్సన్‌ ఔట్‌ కావడంతో రాయల్స్‌ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.  మరోవైపు బట్లర్‌ (37 బంతుల్లో, 7 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ముజీబ్‌ మ్యాజిక్‌
అయితే ముజీబ్‌ సూపర్‌ స్పెల్‌తో రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ కకావికలమైంది. 13వ ఓవర్లో స్టోక్స్‌ (9 బంతుల్లో 12; 2 ఫోర్లు)ను ఔట్‌ చేసిన ముజీబ్‌... 15వ ఓవర్‌ తొలి బంతికి బట్లర్‌ను, రెండో బంతికి ఆర్చర్‌ (0)ను పెవిలియన్‌ చేర్చాడు. వీరంతా 6 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్‌ చేరడంతో స్కోరు వేగం తగ్గింది. చివర్లో శ్రేయస్‌ గోపాల్‌ కాసేపు పోరాడంతో 150 దాటింది. అశ్విన్, రాజ్‌పుత్, అక్షర్‌ పటేల్‌ తలా ఓ వికెట్‌ తీశారు.

పడుతూ... లేస్తూ...
లక్ష్యం సునాయాసమే కానీ... పంజాబ్‌ ఇన్నింగ్స్‌ పడుతూ లేస్తూ సాగింది. ఓపెనర్‌ గేల్‌ (8)తో పాటు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ (2) విఫలమయ్యాడు. దీంతో మరో ఓపెనర్‌ కె.ఎల్‌.రాహుల్‌ బాధ్యతగా ఆడాడు. కరుణ్‌ నాయర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మూడో వికెట్‌కు సరిగ్గా 50 పరుగులు జతయ్యాక నాయర్‌ను అనురీత్, అక్షర్‌ పటేల్‌ (4)ను గౌతమ్‌ పెవిలియన్‌ చేర్చారు. 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోగా... స్టోయినిస్‌ (16 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అండతో రాహుల్‌ (44 బంతుల్లో; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

రన్‌రేట్‌ పెరిగిపోతున్న దశలో రాహుల్‌ భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. చివరి 24 బంతుల్లో 43 కొట్టాల్సిన సమయంలో ఆర్చర్‌ వేసిన ఓవర్లో సిక్స్, ఫోర్‌ సహా 16 పరుగులు వచ్చాయి. తర్వాత రాహుల్‌... ఉనాద్కట్‌ బౌలింగ్‌లో 15 పరుగులు చేశాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 12గా మారింది. రాహుల్‌ సిక్స్, ఫోర్‌ బాది  8 బంతులు మిగిలి ఉండగానే గెలుపు తీరం చేర్చాడు.  రాయల్స్‌ బౌలర్లలో గౌతమ్, ఆర్చర్, స్టోక్స్‌ తలా ఓ వికెట్‌ తీశారు.  

స్కోరు వివరాలు

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (సి) రాహుల్‌ (బి) ముజీబ్‌ 51; షార్ట్‌ (సి) టై (బి) అశ్విన్‌ 2; రహానే (సి) గేల్‌ (బి) పటేల్‌ 5; శామ్సన్‌ (సి) నాయర్‌ (బి) టై 28; స్టోక్స్‌ (సి) తివారి (బి) ముజీబ్‌ 12; త్రిపాఠి (సి) అశ్విన్‌ (బి) టై 11; ఆర్చర్‌ (బి) ముజీబ్‌ 0; గౌతమ్‌ (సి) స్టొయినిస్‌ (బి) రాజ్‌పుత్‌ 5; గోపాల్‌ రనౌట్‌ 24; ఉనాద్కట్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 152.  

వికెట్ల పతనం: 1–3, 2–35, 3–84, 4–100, 5–106, 6–106, 7–114, 8–129, 9–152.

బౌలింగ్‌: అశ్విన్‌ 4–0–30–1, రాజ్‌పుత్‌ 3–0–37–1, ముజీబ్‌ 4–0–27–3, అక్షర్‌ పటేల్‌ 4–0–21–1, టై 4–0–24–2, స్టొయినిస్‌ 1–0–6–0.  

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ నాటౌట్‌ 84; గేల్‌ (సి) శామ్సన్‌ (బి) ఆర్చర్‌ 8; అగర్వాల్‌ (సి) త్రిపాఠి (బి) స్టోక్స్‌ 2; నాయర్‌ (బి) అనురీత్‌ సింగ్‌ 31; అక్షర్‌(సి) షార్ట్‌ (బి) గౌతమ్‌ 4; స్టొయినిస్‌ నాటౌట్‌ 23; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 155.

వికెట్ల పతనం: 1–23, 2–29, 3–79, 4–87.

బౌలింగ్‌: గౌతమ్‌ 3–0–18–1, ఆర్చర్‌ 3.4–0–43–1, స్టోక్స్‌ 3–0–22–1, ఉనాద్కట్‌ 4–0–26–0, గోపాల్‌ 3–0–26–0, అనురీత్‌ సింగ్‌ 2–0–20–1.   

>
మరిన్ని వార్తలు