విలియమ్సన్‌ శతకం వృథా

4 Mar, 2018 04:55 IST|Sakshi
విలియమ్సన్‌

     మూడో వన్డేలో కివీస్‌ ఓటమి

     4 పరుగులతో ఇంగ్లండ్‌ విజయం

వెల్లింగ్టన్‌: కఠినమైన పిచ్‌పై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (143 బంతుల్లో 112 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత సెంచరీ సాధించినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో తుది వరకు పోరాడినా చివరకు కివీస్‌కు ఓటమి తప్పలేదు. శనివారం ఇక్కడి వెస్ట్‌ప్యాక్‌ స్టేడియంలో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (48; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, బెన్‌ స్టోక్స్‌ (39; 2 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ఇష్‌ సోధికి 3 వికెట్లు దక్కాయి.

అనంతరం న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేయగలిగింది. మున్రో (49; 7 ఫోర్లు), సాన్‌ట్నర్‌ (41; 3 ఫోర్లు) రాణించారు. ఒక దశలో 80/1 పటిష్టంగా ఉన్న కివీస్‌...ఇంగ్లండ్‌ స్పిన్నర్లు మొయిన్‌ అలీ (3/36), ఆదిల్‌ రషీద్‌ (2/34) ధాటికి 23 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో విలియమ్సన్, సాన్‌ట్నర్‌ ఏడో వికెట్‌కు 96 పరుగులు జోడించి జట్టును గెలుపు దిశగా నడిపించారు. అయితే వోక్స్‌ ఫాలోత్రూలో దురుదృష్టవశాత్తూ సాన్‌ట్నర్‌ రనౌట్‌ కావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. వోక్స్‌ వేసిన చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా... విలియమ్సన్‌ తొలి నాలుగు బంతుల్లో భారీ సిక్సర్‌ సహా 10 పరుగులు రాబట్టాడు. ఈ స్థితిలో ఒత్తిడిని అధిగమిస్తూ చక్కగా బౌలింగ్‌ చేసిన వోక్స్‌ ఆఖరి రెండు బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఇంగ్లండ్‌ విజయాన్ని ఖాయం చేశాడు. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2–1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో వన్డే బుధవారం డ్యునెడిన్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో 11వ సెంచరీ సాధించిన విలియమ్సన్‌ వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు