‘వివాదాలు కాదు.. ముందు ఆటపై దృష్టి పెట్టు’

5 Jan, 2019 16:45 IST|Sakshi

మనుబాకర్‌పై హర్యానా క్రీడా శాఖా మంత్రి విమర్శలు


కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించడంతో పాటు పలు అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాల పంట పండించిన హర్యానా యువ షూటర్‌ మను బాకర్‌ తీరును ఆ రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి అనిల్‌ విజు విమర్శించారు. కామన్‌వెల్త్‌ క్రీడల్లో పసిడి సొంతం చేసుకున్న మనుకు ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా తనకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని పేర్కొంటూ... ‘ మీరు ప్రకటించిన నజరానా నిజమా లేదా అంతా ఉత్తిదేనా’ అంటూ ఆమె ట్విటర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో మను బాకర్‌ ట్వీట్‌కు స్పందించిన అనిల్‌ విజు.. ‘ ఈ విషయమై సోషల్‌ మీడియాలో ప్రస్తావించే ముందు.. మను బాకర్‌ మొదట క్రీడా శాఖను సంప్రదించాల్సింది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే  క్రీడాకారులకు అత్యధిక అవార్డులు అందిస్తున్న రాష్ట్రం మనదే. నేను ట్వీట్‌ చేసినట్లుగానే.. నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే ఆమెకు రూ. 2 కోట్లు అందజేస్తాం. ఆటగాళ్లకు కాస్త క్రమశిక్షణ అవసరం. ఇలా వివాదం సృష్టించినందుకు ఆమె చింతించాలి. తనకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఇవన్నీ మాని ఆటపై దృష్టిపెడితే బాగుంటుంది’ అని హితవు పలికారు.

మరిన్ని వార్తలు