బీసీ నాయకులు ఎదగకుండా చేసే కుట్ర

5 Jan, 2019 16:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీసీ నాయకులను ఎదగకుండా చేసే కుట్రలో భాగంగానే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ తగ్గింపునకు నిరసనగా తెలంగాణ జనసమితి ధర్మాచౌక వద్ద ఒక రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంతో పాటు బీసీ నేత మాజీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌ కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రస్తుత రిజర్వేషన్లే.. ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కొనసాగుతాయన్నారు. రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగితేనే రాజకీయ వ్యవస్థ బలపడుతుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రిజర్వేషన్లు ఉండాలని, బీసీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

బీసీలపై ఉన్న కసితోనే కేసీఆర్‌.. రిజర్వేషన్లు తగ్గించారని ఆర్‌ కృష్ణయ్య మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం నుంచి 22 శాతం తగ్గించడం అన్యాయమన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు జరిపించిందని గుర్తు చేశారు. జాతిని అమ్ముకుని టీఆర్‌ఎస్‌ బీసీ నేతలు రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్‌లపై సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయాలన్నారు. ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం కాదని, బడి పిల్లలకు బడిలు కట్టివ్వాలని సూచించారు. రిజర్వేషన్లు తగ్గించడం వలన 1500 మంది బీసీలు సర్పంచ్‌ అయ్యే అవకాశం కోల్పోయారన్నారు. అన్ని పార్టీలు బీసీల రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని కుల సంఘాల నాయకులు ఉద్యమించాలని, ప్రపంచంలో చాలా మంది నేతలను చూసామని, కేసీఆర్‌ అంత కన్నా గొప్పవాడేమి కాదన్నారు. 

మరిన్ని వార్తలు