క్రికెట్‌కు కైఫ్‌ వీడ్కోలు 

14 Jul, 2018 01:32 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. సరిగ్గా పదహారేళ్ల క్రితం (2002 జూలై 13) నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్లో అద్భుత పోరాటంతో వెలుగులోకి వచ్చిన కైఫ్‌ తన రిటైర్మెంట్‌కు అదే రోజును ఎంచుకోవడం విశేషం. ‘ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకమైనది అందుకే రిటైర్మెంట్‌కు దీన్ని ఎంచుకున్నా’ అని కైఫ్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు. 37 ఏళ్ల కైఫ్‌ 13 టెస్టులు, 125 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం  వహించాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన అతను 129 దేశవాళీ మ్యాచ్‌ల్లో 7,581 పరుగులు చేశాడు. అందులో 15 సెంచరీలు ఉన్నాయి. అండర్‌–19 ప్రపంచకప్‌ (2000) గెలిచిన భారత యువ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కైఫ్‌ ఆ తర్వాత  టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ యువ రాజ్‌తో కలిసి ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ముఖ్యంగా నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై లార్డ్స్‌ మైదానంలో ఈ జోడీ చెలరేగిన తీరు మరుపురానిది. 326 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో యువీతో కలిసి 121 పరుగులు జతచేసిన కైఫ్‌ (75 బంతుల్లో 87 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)  చివరి వరకు నిలిచి జట్టుకు మధురమైన విజయాన్ని అందించాడు.  పాయింట్, కవర్స్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌లతో ఫీల్డింగ్‌లో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన కైఫ్‌... ఆసాధ్యం అనదగ్గ ఎన్నో క్యాచ్‌లను ఒడిసిపట్టి ఇండియన్‌ జాంటీ రోడ్స్‌గా అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు. 12 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అతను ప్రస్తుతం క్రికెట్‌ విశ్లేషకుడిగా వ్యవహరిస్తున్నాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని ఫూల్‌పూర్‌ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీచేసి ఓటమి పాలయ్యాడు.   

మరిన్ని వార్తలు