భారత్‌ విఫలం: కైఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

11 Aug, 2018 20:00 IST|Sakshi
నాట్‌వెస్ట్‌ ట్రోఫీతో యువీ, గంగూలీ, కైఫ్‌ (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌ గడ్డమీద ఆతిథ్య జట్టు చేతిలో తొలి టెస్టులో ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నాడు. తాను టెస్ట్‌ క్రికెట్‌కు సరిగ్గా సరిపోతానని తెలిపాడు. క్రీజులో పాతుకుపోవడం అలవాటే కనుక టెస్టుల్లో తనకెలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని 13 టెస్ట్‌లు ఆడిన కైఫ్‌ పేర్కొన్నాడు. హార్డ్‌ హిట్టర్‌ యువరాజ్‌ సింగ్‌తో తనను పోల్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తాను యువీని కాదంటూ సున్నితంగా తిరస్కరించాడు. 

‘టెక్నిక్‌ విషయంలో నాశైలి రాహుల్‌ ద్రవిడ్‌, గౌతం గంభీర్‌లను పోలి ఉండేది. వారి బ్యాటింగ్‌ను ఎక్కువగా గమనించేవాడిని. కెరీర్‌ పట్ల ఎలాంటి ఫిర్యాదులు లేవు. అత్యుత్తమ క్రికెటర్లు ఆడుతున్న సమయంలో జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టం. నేను భారత్‌కు ఆడుతున్న సమయంలో జట్టులో ఉన్న కొందరు ప్లేయర్లు దిగ్గజాలు అయ్యారు. భారత్‌లో, విదేశాల్లోనూ జట్టుకు సేవలందించాను. సంతృప్తిగానే కెరీర్‌కు వీడ్కోలు పలికానని’ కైఫ్‌ మనసులో మాటలు వెల్లడించాడు. 

భారత్‌ తరఫున 13 టెస్టులు ఆడిన కైఫ్‌ 1 సెంచరీ, 3 హాఫ్‌ సెంచరీల సాయంతో 624 పరుగులు చేశాడు. 125 వన్డేలాడిన ఈ యూపీ క్రికెటర్‌ 2 శతకాలు, 17 హాఫ్‌ సెంచరీల సాయంతో 2,753 పరుగులు చేశాడు. అందులో 2002లో నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై చేసిన 87 పరుగుల ఇన్నింగ్స్‌ను కైఫ్‌ మాత్రమే కాదు.. భారత క్రికెట్‌ అభిమానులు మరిచిపోలేరు. ట్రోఫీ నెగ్గిన అనంతరం సంబరాల్లో భాగంగా అప్పటి భారత కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ జెర్సీ(టీషర్ట్‌) విప్పి గాల్లో తిప్పడం జట్టుకు ఓ మధురానుభూతిగా మిగిలిపోయింది.

>
మరిన్ని వార్తలు