మాజీ ఆటగాడికి అండగా హాకీ ఇండియా

30 Jun, 2016 16:50 IST|Sakshi
మాజీ ఆటగాడికి అండగా హాకీ ఇండియా

న్యూఢిల్లీ: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న భారత మాజీ హాకీ ఆటగాడు మొహ్మద్ షాహిద్కు అండగా ఉండేందుకు హాకీ ఇండియా(ఎచ్ఐ) ముందుకొచ్చింది. ఒకవేళ అతనికి కాలేయ మార్పిడి అవసరమైతే వైద్యానికి అయ్యే ఖర్చులను పూర్తిగా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాజాగా వెల్లడించింది.  గత నెలలో షాహిద్ కు కామెర్లు సోకడంతో చికిత్స తీసుకున్నారు. అయితే ఆయన కోలుకున్న తరువాత ఉదర సంబంధిత సమస్యలు తలెత్తడంతో స్థానికి ఆస్పత్రిలో చేరారు. అయితే అక్కడ షాహిద్ పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని వారణాసి నుంచి ఢిల్లీలోని మెడంటా ఆస్పత్రికి తరలించారు. దానిలో భాగంగానే గత మూడు రోజుల నుంచి ఆయన్ను అబ్జర్వేషన్లో ఉంచారు.

అయితే ఆ ఆటగాడికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హాకీ ఇండియా తెలిపింది. అతని వైద్యానికి అయ్యే ఖర్చులను పూర్తిగా భరిస్తామని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బత్ర స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే షాహిద్ కుటుంబంతో నిత్యం టచ్ లో అతని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అతనికి కాలేయ మార్పిడి అవసరమైన పక్షంలో ఆ ఖర్చులను కూడా భరిస్తామని నరీందర్ బత్ర తెలిపారు.1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన హాకీ జట్టులో షాహిద్ సభ్యుడు .1981లో షాహిద్ను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. కాగా, ఆ తరువాత 1982లో ఆసియా గేమ్స్లో రజతం, 1986లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టులో షాహిద్ ఆటగాడిగా ఉండటం విశేషం.

మరిన్ని వార్తలు