బంతితో ఫుట్‌బాల్‌ ఆడేసి.. వికెట్‌ తీశాడు!

19 Jan, 2020 09:47 IST|Sakshi

సిడ్నీ:  ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ ఫీల్డింగ్‌లో అదుర్స్‌ అనిపించాడు. శనివారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌ తరఫున ఆడుతున్న మోరిస్‌ బంతిని ఫుట్‌బాల్‌ తరహాలో తన్ని వికెట్‌ను సాధించాడు. సిడ్నీ సిక్సర్స్‌ తొలి ఓవర్‌ ఆడటానికి సిద్ధం కాగా, థండర్స్‌ మోరిస్‌ చేతికి బంతినిచ్చింది.  ఆ ఓవర్‌ ఐదో బంతికి డానియల్‌ హ్యూజ్స్‌ బంతిని డిఫెన్స్‌ ఆడి పరుగు తీయడానికి యత్నించాడు. అయితే బౌలింగ్‌ ఎండ్‌ నుంచి పరుగెత్తుకొంటూ వచ్చిన మోరిస్‌ బంతిని అమాంతంపై వికెట్లవైపు కాలితో తన్నేశాడు. ఫుట్‌బాల్‌ తరహాలో తన్నిన ఆ బంతి కాస్తా వికెట్లకు తగలడం, ఆ సమయానికి  డానియల్‌ క్రీజ్‌లో చేరుకోలేకపోవడంతో రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దీనికి సంబంధించి వీడియోను బీబీఎల్‌ తన అధికారిక ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది. 

ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌ 15.5 ఓవర్లలో 76 పరుగులకు ఆలౌటైంది. అటు తర్వాత సిడ్నీ థండర్స్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన కాసేపటికి వర్షం పడింది. సిడ్నీ థండర్స్‌ 5.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగుల వద్ద ఉండగా వర్షం పడింది. దాంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం థండర్స్‌ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు.   రాబోవు ఐపీఎల్‌ సీజన్‌లో మోరిస్‌ ఆర్సీబీ తరఫున బరిలో దిగుతున్నాడు.

మరిన్ని వార్తలు