ఎంఎస్‌ ధోని మరొకసారి..

24 Sep, 2018 12:29 IST|Sakshi

దుబాయ్‌: డీఆర్ఎస్(డెసిషన్ రివ్యూ సిస్టమ్) గురించి అందరికీ తెలిసిందే. ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని పునః సమీక్షించే పద్దతినే డీఆర్ఎస్ అంటారు. కాగా, డీఆర్ఎస్ అంటే ధోని రివ్య్యూ సిస్టమ్ అని తరచు వినిపిస్తుండటం మనం చూస్తునే ఉన్నాం. డీఆర్‌ఎస్‌ను ఇలా ధోనికి ఎందుకు ఆపాదించారంటే ఇందులో అతను  ఎక్కువగా సక్సెస్‌ సాధించడమే. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్‌లో ధోని మరోసారి డీఆర్‌ఎస్‌ విషయంలో విజయం సాధించాడు.

ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో ఓవర్‌ను చాహల్‌ వేశాడు. ఆ ఓవర్‌ ఆఖరి బంతి పాక్‌ ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ను ప్యాడ్లను ముద్దాడింది. ఫ్రంట్‌ ఫుట్‌ ఆడే క్రమంలో ఆ బంతి ఇమామ్‌ ప్యాడ్‌ను తాకుతూ ఆఫ్‌ స్టంప్‌ మీదకు వెళుతున్నట్లు కనబడింది. దీనిలో భాగంగా భారత ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా, ఫీల్డ్‌ అంపైర్‌ నిరాకరించాడు. దాంతో రోహిత్‌ను రివ్యూకు వెళదామంటూ ధోని తలతో సైగ చేశాడు. ఇక్కడ రోహిత్‌ రెండో ఆలోచన లేకుండా రివ్యూ కోరడంతో ఇమాముల్‌ హక్‌ ఔటయ్యాడు. ఆ బంతి మిడిల్‌ స్టంప్‌ వికెట్లను తాకుతున్నట్లు రివ్యూలో తేలడంలో ఇమాముల్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. దాంతో 24 పరుగుల వద్ద పాక్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది.

ఎంతో నిశిత దృష్టి ఉంటే కానీ అటువంటి ఔట్ల విషయాలను సవాల్‌ చేయలేం. కానీ ధోని మరోసారి డీఆర్‌ఎస్‌లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు.  అందుచేత ధోనిపై ప్రశంసలతో ముంచెత్తుతున్నారు మాజీ క్రికెటర్లు, అభిమానులు. డీఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ అని కొనియాడుతున్నారు. ‘అంతటి సూక్ష్మ బుద్ధితో రోహిత్‌ను రివ్యూకు వెళ్లమని చెప్పడం ధోనికే చెల్లింది. నిజంగా ధోని జీనియస్‌’ అని గావస‍్కర్‌ కొనియాడాడు. మరొకవైపు ట్వీటర్‌ వేదికగా ‘ధోని రివ్యూ సిస్టమ్‌’పై ప్రశంసలు కురుస్తున్నాయి.

మరిన్ని వార్తలు