ధోని మరో అదిరిపోయే స్టంపింగ్‌..!!

26 Jan, 2019 15:38 IST|Sakshi

మౌంట్‌ మాంగనీ: టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని మరోసారి అద్భుతమైన స్టంపింగ్‌తో ఆకట్టుకున్నాడు. మౌంట్‌ మాంగనీలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ విశేషం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన జాదవ్‌ .. తొలిబంతిని కాస్త తక్కువ వేగంతో విసరడంతో కివీ బ్యాట్స్‌మన్‌ టేలర్‌ అంచనా వేయలేకపోయాడు. ముందుకు వచ్చి బంతిని నెట్టేద్దామనుకునేలోపే.. అది వెళ్లి ధోని చేతిలో పడడం.. అతను క్షణాల్లో వికెట్లను గిరాటేయడం జరిగిపోయాయి. దాంతో టేలర్‌ ఔట్‌..! టేలర్‌ను ఔట్‌ చేయడం ద్వారా మహి ఖాతాలో 119వ స్టంపింగ్‌ చేరింది. (రెండో వన్డేలోనూ భారత్‌దే విజయం)

337 వన్డేలాడిన ధోని 311 క్యాచ్‌ ఔట్లు, 119 స్టంపింగ్‌లు చేశాడు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు (520) ఆడిన వికెట్‌ కీపర్‌ ధోనియే కావడం విశేషం. కాగా, ప్రపంచ అత్యుత్తమ వికెట్‌ కీపర్ల జాబితాలో కుమార సంగక్కర, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ తరువాతి స్థానంలో ధోని కొనసాగుతున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో 48 (33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌) పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మిస్టర్‌ కూల్‌ టీమిండియా భారీ స్కోరు (324) సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు.

భారత్‌ నిర్దేశించిన 325 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్‌ తడబడింది. మార్టిన్‌ గప్టిల్‌(15), విలియమ్సన్‌(20), మున్రో(31), రాస్‌ టేలర్‌(22), టామ్‌ లాధమ్‌(34), గ్రాండ్‌ హోమ్‌(3), హెన‍్రీ నికోలస్‌(28), ఇష్‌ సోధీ(0)లు వరుసగా క‍్యూకట్టడంతో కివీస్‌కు ఘోర ఓటమి తప్పలేదు. ఫలితంగా సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. బ్రాస్‌వెల్‌(57; 46 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినప్పటికీ కివీస్‌ను గెలిపించలేకపోయాడు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లతో కివీస్‌ వెన్నువిరవగా, భువనేశ్వర్‌ కుమార్‌, చహల్‌లు తలో రెండు వికెట్లు తీశారు. షమీ, కేదర్‌ జాదవ్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు