‘ధోని వన్డే కెరీర్‌ ముగిసినట్లే’

10 Jan, 2020 00:55 IST|Sakshi

రవిశాస్త్రి పరోక్ష వ్యాఖ్య

టి20లే ఆడతాడన్న భారత కోచ్‌

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ కెరీర్‌ కొనసాగింపునకు సంబంధించి భారత కోచ్‌ రవిశాస్త్రి కీలక వ్యాఖ్య చేశాడు. వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన ధోని తన పునరాగమనంపై ఒక్కసారి కూడా స్పష్టతనివ్వలేదు. దాంతో ఈ విషయంపై భారత క్రికెట్‌ వర్గాల్లో సందిగ్ధత నెలకొంది.  నేరుగా కాకపోయినా తన అభిప్రాయంతో ఇప్పుడు రవిశాస్త్రి మాజీ కెప్టెన్‌ మనసులో మాటను చెప్పే ప్రయత్నం చేశాడు. ధోని మున్ముందు వన్డేలనుంచి పూర్తిగా తప్పుకొని టి20లపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు.

‘నేను ధోనితో మాట్లాడాను. ఏం చర్చించుకున్నామనేది మాకు మాత్రమే తెలుసు. అయితే టెస్టులకు గుడ్‌బై చెప్పినట్లుగానే త్వరలో అతను వన్డేలనుంచి కూడా తప్పుకోబోతున్నాడు.  ధోని తన వన్డే కెరీర్‌ ముగించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అతని వయసును బట్టి చూస్తే టి20 ఫార్మాట్‌లోనే ఆడాలనుకుంటున్నాడు. సాధన మొదలు పెట్టి ఐపీఎల్‌ బరిలోకి దిగిన తర్వాత అతని శరీరం ఎలా స్పందిస్తుందో చూడాలి’ అని రవిశాస్త్రి వివరించాడు. ఐపీఎల్‌లో బాగా ఆడితే టి20 ప్రపంచ కప్‌ జట్టులోకి ఎంపికయ్యేందుకు ధోనికి మంచి అవకాశాలు ఉన్నాయని కోచ్‌ అభిప్రాయ పడ్డాడు. ప్రపంచ కప్‌లాంటి టోర్నీకి అనుభవంతో పాటు ఫామ్‌ కూడా కీలకమని శాస్త్రి అన్నాడు.

నాలుగు రోజుల టెస్టు అవసరం లేదు! 
టెస్టు మ్యాచ్‌ను నాలుగు రోజులకు కుదించాలంటూ వస్తున్న ప్రతిపాదనలపై రవిశాస్త్రి తీవ్రంగా విభేదించాడు. ‘నాలుగు రోజుల టెస్టు ఆలోచనే అర్థరహితం. ఇది ఇలాగే సాగితే పరిమిత ఓవర్ల టెస్టులు వస్తాయేమో. ఐదు రోజుల మ్యాచ్‌లను మార్చాల్సిన పని లేదు. అయితే నిజంగానే మార్పు చేయాల్సిందేనని భావిస్తే టాప్‌–6 జట్లు ఐదు రోజుల టెస్టులు, దిగువ స్థానాల్లో ఉన్న జట్లు నాలుగు రోజుల టెస్టులు ఆడాలి’ అని రవిశాస్త్రి సూచించాడు.

మరిన్ని వార్తలు