ధోని ‘బ్రాండ్’ ముగింపు

22 May, 2016 08:51 IST|Sakshi
ధోని ‘బ్రాండ్’ ముగింపు

చివరి బంతికి పుణే విజయం  పంజాబ్‌కు ఆఖరి స్థానం
 
ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభం నుంచి ధోనికి అనేక సమస్యలు. కీలక ఆటగాళ్లకు గాయాలు... ఫామ్‌లో లేని సహచరులు... దీంతో ప్లే ఆఫ్ రేసు నుంచి ఎప్పుడో వెనుదిరిగింది. ఇక ఆఖరి మ్యాచ్‌లో గెలవకపోతే చివరి స్థానంతో అవమాన భారాన్ని మోయాల్సి వస్తుంది. ఐపీఎల్‌లో తిరుగులేని కెప్టెన్‌గా పేరున్న ధోని దీనిని జీర్ణించుకోలేకపోయాడేమో... తన అసలు సిసలు ఆటతీరుతో ఆఖరి మ్యాచ్‌లో అద్భుతం చేశాడు. సంచలన ఇన్నింగ్స్‌తో పుణేను ఒంటిచేత్తో గెలిపించి... ఇటీవల తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు.
 
 
సాక్షి, విశాఖపట్నం: 3 బంతుల్లో 16 పరుగులు... ఆఖరి మ్యాచ్‌లో పుణే విజయానికి అవసరమైన సమీకరణం ఇది. ఈ దశలో ధోని దుమ్మురేపాడు. తన బ్రాండ్ షాట్లతో... చాలాకాలం తర్వాత తనదైన శైలిలో మ్యాచ్‌ను ‘ఫినిష్’ చేశాడు. ఓ బౌండరీ, రెండు సిక్సర్లతో పుణేకు చిరస్మరణీయ విజయాన్ని అందించి... లీగ్‌లో ఆఖరి స్థానం బాధ నుంచి జట్టును తప్పించాడు. కెప్టెన్ ధోని (32 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో పుణే జట్టు నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై విజయం సాధించింది. పుణే ఏడోస్థానంతో, పంజాబ్ ఆఖరి స్థానంతో సీజన్‌ను ముగించాయి.

డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్... 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. మురళీ విజయ్ (41 బంతుల్లో 59; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), గురుకీరత్ సింగ్ (30 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించగా... హషీమ్ ఆమ్లా (27 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నాడు.  అశ్విన్ 4 వికెట్లు తీశాడు.


రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. తొలి 10 ఓవర్లలో 2 వికెట్లకు కేవలం 62 పరుగులు మాత్రమే చేసిన ధోని... ఇన్నింగ్స్‌లో చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు చేయడం విశేషం. విజయానికి 49 బంతుల్లో 93 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన ధోని... పెరీరా (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్సర్) సహాయంతో ధాటిగా ఆడాడు. చివరి 2 ఓవర్లలో 29 పరుగులు చేయాల్సి ఉండగా మోహిత్ శర్మ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి పుణేను కట్టడి చేశాడు. చివరి ఓవర్లో విజయానికి 23 పరుగులు అవసరం కాగా... ధోని సింగిల్స్ కూడా తీయకుండా ఈ ఓవర్లో మొత్తం మూడు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి పుణేను గెలిపించడం విశేషం.

 
 స్కోరు వివరాలు: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) బెయిలీ (బి) అశ్విన్ 30; విజయ్ (బి) అశ్విన్ 59; సాహా (సి) అశ్విన్ (బి) జంపా 3; గురుకీరత్ (సి) చాహర్ (బి) అశ్విన్ 51; మిల్లర్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 7; బెహర్డీన్ (సి) రహానే (బి) దిండా 5; అక్షర్ పటేల్ (సి) తివారీ (బి) పెరీరా 1; రిషి ధావన్ (నాటౌట్) 11; అబాట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 172.


వికెట్ల పతనం: 1-60; 2-65; 3-123; 4- 150; 5-154; 6-160; 7-160.  బౌలింగ్: పఠాన్ 4-0-37-0; దిండా 3-0-16-1; చాహర్ 3-0-28-0; పెరీరా 2-0-24-1; అశ్విన్ 4-0-34-4; జంపా 4-0-32-1.

పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (సి) సాహా (బి) సందీప్ 19, ఖవాజా (సి) మిల్లర్ (బి) గురుకీరత్ 30; బెయిలీ (స్టం) సాహా (బి) పటేల్ 9; తివారీ (సి) బెహర్డీన్ (బి) గురుకీరత్ 17; ధోని నాటౌట్ 64; ఇర్ఫాన్ (సి) సాహా (బి) ధావన్ 2, పెరీరా (సి) సాహా (బి) మోహిత్ 23; అశ్విన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 173.

వికెట్ల పతనం: 1-35, 2-47, 3-78, 4-80, 5-86, 6-144.
బౌలింగ్: సందీప్ శర్మ 4-0-29-1; మోహిత్ శర్మ 4-0-39-1; అబాట్ 3-0-25-0; అక్షర్ 4-0-43-1; గురుకీరత్ 2-0-15-2; రిషి ధావన్ 3-0-21-1.

>
మరిన్ని వార్తలు