ముంబై ఇండియన్స్ 'డేరింగ్' విక్టరీ

15 May, 2016 23:45 IST|Sakshi
ముంబై ఇండియన్స్ 'డేరింగ్' విక్టరీ

విశాఖపట్నం: ప్లే ఆఫ్ రౌండ్ లోకి ప్రవేశించేందుకు కీలకమైన మ్యాచ్ లో ముంబై మెరిసింది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై  80 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ సేన విసిరిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో క్వింటన్ డికాక్ (40, 28 బంతుల్లో) తప్ప మిగతా ఢిల్లీ బ్యాట్స్ మన్లందరూ విఫలమయ్యారు. అసలే భారీ టార్గెట్ కావడం, రెగ్యులర్ గా వికెట్లు పడటంతో ఢిల్లీ 19.1 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో బుమ్రా 3, కృనాల్ పాండ్యా 2, హర్భజన్, విజయ్ కుమార్ లు తలో వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్.. కృనాల్ పాండ్యా(86;37 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ తో 20 ఓవర్లలో 205 పరుగులు సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(31;21 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), గప్తిల్(48;42 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్ చేశారు. చివర్లో బట్లర్(18 నాటౌట్;9 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్స్),అంబటి రాయుడు(13 నాటౌట్;5 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 206 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్ కు రెండు వికెట్లు దక్కగా, జహీర్ ఖాన్, అమిత్ మిశ్రాలకు తలో వికెట్ లభించింది.

మరిన్ని వార్తలు