నన్ను కావాలనే ఇరికిస్తున్నారు: మునాఫ్‌

6 Sep, 2019 16:14 IST|Sakshi

న్యూఢిల్లీ: విదర్భ క్రికెట్‌ చీఫ్‌ దేవేంద్ర సుర్తి  తనను కావాలనే ఇరికిస్తున్నారని భారత మాజీ క్రికెటర్‌ మునాఫ్‌ పటేల్‌ ఆరోపించాడు.  తాను దేవేంద్రను చంపుతానంటూ ఆయన చేసిన ఫిర్యాదు వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందని మునాఫ్‌ పేర్కొన్నాడు. తాను కేవలం క్రికెటర్ల ఆటకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడం తప్ప, సెలక్షన్‌ పరమైన వాటిలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌(బీసీఏ) క్రికెట్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న మునాఫ్‌ అన్నాడు.

తనను మునాఫ్‌ చంపుతానంటూ బెదిరించినట్లు దేవేంద్ర సుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడటాన్ని సహించలేక మునాఫ్‌ బెదిరింపులకు దిగాడని సుర్తి పేర్కొన్నారు. ఒకవేళ తనకు కానీ, కుటుంబానికి కానీ ఏమైనా ప్రమాదం వాటిల్లితే మునాఫ్‌నే పూర్తి బాధ్యడ్ని చేయాల్సి ఉంటుందని పోలీస్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాము సుర్తి నుంచి ఫిర్యాదు తీసుకున్నామని, ఇప్పటివరకూ అయితే ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయలేదని నవాపురా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఎమ్‌ చౌహాన్‌ తెలిపారు.

దీనిపై స్పందించిన మునాఫ్‌.. ‘ ఎటువంటి కారణాలు లేకుండా నా పేరును తెరపైకి తీసుకొచ్చారు. నాకు తెలిసినంత వరకూ క్రికెట్‌ ఆడటమే తెలుసు. సుర్తికి సెలక్షన్‌ కమిటీ సభ్యులతో ఇబ్బందులున్నాయి. నేను కేవలం మెంటార్‌ని మాత్రమే. నాకు సెలక్షన్స్‌తో ఎటువంటి  సంబంధం ఉండదు. అటువంటప్పుడు నాపేరును ఎందుకు బయటకు తెస్తున్నారు. ఇది అనవసరమైన రాద్ధాంతం తప్ప నేను ఎవర్నీ చంపుతానని బెదిరించలేదు’ అని మునాఫ్‌ పేర్కొన్నాడు. మునాఫ్‌ పటేల్‌ 2006లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసి 70 వన్డేలు, 13 టెస్టులు, 3 టీ20లు ఆడాడు.  గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన మునాఫ్‌.. 2011లో భారత్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు.
 

>
మరిన్ని వార్తలు