నా కెరీర్ ముగిసిపోయినట్లే!

23 Aug, 2016 15:27 IST|Sakshi
నా కెరీర్ ముగిసిపోయినట్లే!

న్యూఢిల్లీ: తనపై విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని మరొకసారి సమీక్షించకపోతే ఇక కెరీర్  ముగిసిపోయినట్లేనని భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో భారత దేశం జోక్యం చేసుకోవాలని నర్సింగ్ పేర్కొన్నాడు. 'కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పును పునఃసమీక్షించకపోతే నా కెరీర్ ముగిసినట్లే. ఈ నిషేధం అనేది కేవలం నా ఒక్కడికే పరిమితం కాదు.. యావత్ దేశానికే సంబంధించింది. నా కేసును సమీక్షించడానికి  దేశంలోని పెద్దలు చొరవచూపకపోతే ఒక అమాయకుడు బలవుతాడు' అని నర్సింగ్ తెలిపాడు. ఈ డోపింగ్ ఉదంతంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని నర్సింగ్ మరోసారి పునరుద్ఘాటించాడు.

జూన్ 25వ తేదీన నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో నర్సింగ్ యాదవ్ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత నర్సింగ్ కు రెండోసారి పరీక్షలు నిర్వహించిన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా).. రెండు సార్లు తీర్పును వాయిదా వేసిన అనంతరం ఆగస్టు 1వ తేదీన అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో నర్సింగ్ యాదవ్ ఎన్నో ఆశలతో రియోలో అడుగుపెట్టాడు.  కాగా, నాడా' ఇచ్చిన క్లీన్ చీట్ ను సీఏఎస్ లో వాడా సవాల్ చేయడం, ఆపై నర్సింగ్ పై నిషేధం పడటంతో అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
 

మరిన్ని వార్తలు