ఇంకా ముగిసిపోలేదు: పుజారా

23 Feb, 2018 13:34 IST|Sakshi

న్యూఢిల్లీ: టెస్టు క్రికెటర్‌గా ముద్ర పడిన చతేశ్వర పుజారా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్థానం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్‌లో పోటీ తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో పుజారాకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్థానం ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటివరకూ తన కెరీర్‌లో ఐదు వన్డేలు మాత్రమే ఆడిన పుజారా.. ఇంకా ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు కూడా ఆడలేదు. కాగా, తన పరిమిత ఓవర్ల కెరీర్‌పై పుజారా ఆశలు మాత్ర​ వదులుకోలేదు. ఇంకా తన పరిమిత ఓవర్ల క్రికెట్‌ ముగిసిపోలేదని, దాని కోసం శ్రమిస్తూనే ఉన్నానని తాజాగా పేర్కొన్నాడు. ఏదొక రోజు ఆ ఫార్మాట్‌ క్రికెట్‌లో తన సత్తా చాటుకుంటాననే ఆశాభావం వ్యక్తం చేశాడు.

'నేను ఇక్కడ ఒక్కటి మాత్రం చెప్పగలను. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 88 మ్యాచ్‌లకు 58కిపైగా యావరేజ్‌ సాధించా. అదే సమయంలో దేశవాళీ టీ20ల్లో 58 గేమ్‌ల్లో 105.18 స్టైక్‌రేట్‌ కూడా నమోదు చేశాను. ఇంకా పొట్టి ఫార్మాట్‌లో చాలా క్రికెట్‌ ఆడే అవకాశం కూడా ఉంది. నాకు అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రానందుకు చింతించడం లేదు. ఏదొక సమయంలో పరిమిత ఓవర్ల అవకాశం కూడా దక్కుతుందని బలంగా నమ్ముతున్నా. నేను వన్డేలకు టీ20లకు కూడా నేను కచ్చితంగా సరిపోతాను' అని పుజారా తెలిపాడు. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ ఆడిన పుజారా.. వన్డే మ్యాచ్‌ ఆడి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. 2014లో పుజారా చివరిసారి వన్డే మ్యాచ్‌ ఆడాడు.

>
మరిన్ని వార్తలు