న్యూజిలాండ్‌దే టెస్టు సిరీస్‌

4 Dec, 2019 00:20 IST|Sakshi

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ‘డ్రా’

విలియమ్సన్, టేలర్‌ సెంచరీలు

హామిల్టన్‌: ఇంగ్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను న్యూజిలాండ్‌ 1–0తో సొంతం చేసుకుంది. మంగళవారం ముగిసిన రెండో టెస్టులో చివరి రోజు కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ విలియమ్సన్‌ (234 బంతుల్లో 104 నాటౌట్‌; 11 ఫోర్లు), రాస్‌ టేలర్‌ (186 బంతుల్లో 105 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకాలతో కదంతొక్కారు. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసి 140 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వాన ఎంతకీ తగ్గకపోవడంతో ఆటను ముగించారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన కెప్టెన్‌ రూట్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు నెగ్గగా... కివీస్‌ పేసర్‌ నీల్‌ వాగ్నర్‌కు  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం లభించింది.

కివీస్‌కు ‘స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’ అవార్డు 
న్యూజిలాండ్‌ జట్టుకు ‘స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’ అవార్డు దక్కింది. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కివీస్‌ రన్నరప్‌గా నిలిచింది. ‘సూపర్‌ ఓవర్‌’దాకా ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో సమఉజ్జీగా నిలిచిన న్యూజిలాండ్‌... బౌండరీల లెక్కల్లో వెనుకబడి ఓడింది. అయితే ఆ టోర్నీలో కేన్‌ విలియమ్సన్‌ సేన చూపిన హుందాతనం అందరి మనసుల్ని గెలుచుకుంది. ఫైనల్లో క్షణానికోసారి పైచేయి మారుతున్నా... స్టోక్స్‌ (ఇంగ్లండ్‌) బ్యాట్‌ను తాకుతూ ఓవర్‌ త్రో బౌండరీ వెళ్లినా... అంపైర్‌ అదనపు పరుగు ఇచ్చినా... కివీస్‌ ఆటగాళ్లు మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) న్యూజిలాండ్‌ జట్టును ‘క్రిస్టోఫర్‌ మార్టిన్‌–జెన్‌కిన్స్‌ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’ అవార్డుకు ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌తో ఇక్కడ జరిగిన రెండో టెస్టు ‘డ్రా’గా ముగియగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ), బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌లు ఉమ్మడిగా స్పిరిట్‌ అవార్డును కివీస్‌ జట్టుకు అందజేశారు. 

విలియమ్సన్, టేలర్‌

మరిన్ని వార్తలు