దిద్దుబాటు చర్యలే కీలకం

4 Dec, 2019 00:18 IST|Sakshi

హైదరాబాద్‌ శివార్లలో జరిగిన ‘దిశ’ ఘటనపై సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఆగ్రహా వేశాలు, ఆందోళన వ్యక్తమయ్యాయి. చర్చ సందర్భంగా అన్ని పక్షాల సభ్యులూ నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని డిమాండ్‌ చేయడంతో పాటు, అత్యాచారానికి ఉరే ఏకైక శిక్షగా ఉండేలా చట్టాన్ని సవరించాలని కోరారు. ఆ ఘటన  వెలుగుచూసిన నాటి నుంచీ సమాజంలో భిన్న రంగాలకు చెందిన వారు చేస్తున్న డిమాండ్‌ వారి గళంలో ప్రతిఫలించింది. ‘దిశ’ ఉదంతం దేశవ్యాప్తంగా నిరసనలు రగిల్చింది. వేలాదిమంది వీధుల్లోకొచ్చి నేరగాళ్లను వెను వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని లేదా ఎన్‌కౌంటర్‌ చేయాలని, సత్వరం కఠిన శిక్షలు పడితేనే ఇటువంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుందని డిమాండ్‌ చేస్తున్నారు.

పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ఎన్నోచోట్ల ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నాయి.నేరగాళ్ల క్రూరత్వం తీవ్రత సమాజం మొత్తాన్ని తల్లడిల్లజేస్తుంది. ఏడేళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో నిర్భయను, ఆమె స్నేహితుణ్ణి మభ్యపెట్టి బస్సులో ఎక్కించుకున్న ఆరుగురు మృగాళ్లు పాశవికంగా ప్రవర్తించినప్పుడూ ఇదే తరహాలో దేశం మొత్తం భగ్గున మండింది. దాని పర్యవసానంగానే కఠినమైన నిబంధనలతో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. జస్టిస్‌ జేఎస్‌ వర్మ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ అలుపెరగకుండా చేసిన కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది. ఆ కమిటీ నెలరోజుల్లోనే నివేదిక అందజేయగలిగింది. దోషులకు కఠిన శిక్షపడేలా చట్టాన్ని సవరించడానికి సిద్ధంగా ఉన్నామని లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హామీ ఇచ్చారు.

రాజ్య సభలో చర్చను ప్రారంభించిన సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ఏం చేయాలన్న అంశంపై అందరూ దృష్టిపెట్టాలని అంటూనే చట్టం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం కాదని సరిగానే అభిప్రాయపడ్డారు. చర్చలో పాల్గొన్న సమాజ్‌వాదీ సభ్యురాలు జయా బచ్చన్‌ అయితే అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలినవారిని కొట్టి చంపాలని డిమాండ్‌ చేసి సంచ లనం సృష్టించారు. 

జస్టిస్‌ వర్మ కమిటీ తన నివేదికలో చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాలి. దేశంలో అభద్ర వాతావరణానికి కారణం చట్టాలు లేకపోవడం వల్ల కాదనీ, వాటిని సక్రమంగా అమలు పరిచే వ్యవస్థ లేకపోవడమే ప్రధాన సమస్య అని తెలిపింది. జస్టిస్‌ వర్మ కమిటీ ఒక్కటే కాదు... అంత క్రితం పలు సంఘాలు కూడా ఇదే మాట చెప్పాయి. వ్యవస్థలోని వివిధ విభాగాల్లో పేరుకుపోయిన అలసత్వాన్నీ, ఉదాసీనతనూ పారదోలనంతకాలం ఎన్ని చట్టాలున్నా ఫలితం ఉండదని లా కమిషన్‌ నివేదిక సైతం 2000 సంవత్సరంలో హెచ్చరించింది.

పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారం లేదా సామూహిక అత్యాచారం చేసే నేరగాళ్లకు ఉరిశిక్ష విధించేలా 2018లో భారతీయ శిక్షాస్మృతిని సవరించారు. ఇది చరిత్రాత్మకమైనదని అందరూ ప్రశంసించారు. ఆ సవరణ ఫలితం నిరుడంతా కనబడింది. అత్యాచారం కేసుల్లో నేరగాళ్లకు 2000 సంవత్సరం తర్వాత అత్యధికంగా మరణశిక్షలు పడటం ఇదే తొలిసారని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది. 2018లో అత్యాచారం కేసుల్ని విచారించిన దిగువ కోర్టులు మొత్తం 162మంది నిందితులకు మరణశిక్షలు విధించాయి. అంతక్రితం ఈ సంఖ్య 108. కింది కోర్టులు విధించే ఉరిశిక్షలను హైకోర్టులు ధ్రువీకరించాల్సి ఉంటుంది.

2018లో 23మంది ఉరిని మాత్రమే హైకోర్టులు ఖరారు చేశాయి. 58 కేసుల్లో యావజ్జీవ శిక్షగా మార్చాయి. దాదాపు 25 కేసుల్లో నిందితులు నిర్దోషులని తీర్పునిచ్చాయి. సుప్రీంకోర్టు నిరుడు మొత్తం 12 కేసుల్లో అప్పీళ్లను విచారించింది. వీటిల్లో 2017నాటివి, అంతక్రితం కేసులూ కూడా ఉన్నాయి. 11 కేసుల్లో దోషులకు యావజ్జీవశిక్ష విధించింది. ఒక్క కేసులో మాత్రమే ముగ్గురు నేరగాళ్లకు ఉరిశిక్ష ఖరారు చేసింది. అది  నిర్భయ కేసు! వీరికి తక్షణం మరణశిక్ష అమలు చేయాలని దాఖలైన పిటిషన్‌ను నిరుడు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆ హంతకులు దాఖలు  చేసిన రివ్యూ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది.

వాస్తవానికి అంతకుముందున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ జేఎస్‌ కేహార్‌లతో పోలిస్తే ఈమధ్యనే రిటైరైన జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తన పదవీకాలంలో మరణశిక్షల కేసులను సాధ్యమైనంత త్వరగా తేల్చాలన్న సంకల్పాన్ని ప్రదర్శించారు. ముగ్గురేసి న్యాయమూర్తు లుండే నాలుగు ధర్మాసనాలను ఇందుకోసం ఏర్పాటుచేశారు. ఈ ధర్మాసనాలు ఆరువారాలపాటు ప్రత్యేకించి ఈ కేసులను మాత్రమే విచారించాయి. ఒక నేరాన్ని మరణశిక్ష పరిధిలోకి తెస్తే ఇంత సుదీర్ఘ ప్రక్రియ సాగుతుంది. ఇప్పుడు పార్లమెంటులోనూ, వెలుపలా వెల్లువెత్తిన డిమాండ్ల పర్యవ సానంగా చట్టాన్ని మరింత కఠినం చేయడానికి సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది గనుక ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎలాంటి సూచనలొస్తాయో చూడాలి. 

అయితే అంతకన్నా ముందు సమాజంలో అన్ని స్థాయిల్లోనూ పేరుకుపోయిన పురుషాధిక్య భావనను కూకటివేళ్లతో పెకిలించాలి. కుటుంబాలతో మొదలుపెట్టి వివిధ ప్రభుత్వ విభాగాల వరకూ అన్నిచోట్లా అంతర్లీనంగా ఉంటున్న ఈ చీడను వదలగొట్టకపోతే సమస్య పరిష్కారం కాదు. ఇంట్లోనూ, బయటా మహిళల్ని గౌరవించడం విషయంలో సమాజం ఆలోచనను మార్చకుండా కఠిన చట్టాల వల్ల ఒరిగేదేమీ ఉండదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భానుమతి ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. అత్యాచార కేసులు నమోదు చేయడంలో ఉదాసీనత ప్రదర్శించే పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ జేఎస్‌ వర్మ కమిటీ చెప్పింది. అసలు అత్యా చార కేసుల్ని విచారించే తీరు మారాలని సూచించింది. ఇలాంటి అంశాలన్నిటినీ సమగ్రంగా పరిశీ లించి దిద్దుబాటు చర్యలు తీసుకోనంతకాలం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా వృధా అవుతాయని గుర్తించాలి. 

>
మరిన్ని వార్తలు