నిఖత్‌ సంచలనం

24 Apr, 2019 01:13 IST|Sakshi

క్వార్టర్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్‌పై విజయం

 సెమీస్‌కి చేరి పతకం ఖాయం చేసుకున్న తెలంగాణ బాక్సర్‌

బ్యాంకాక్‌: ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ సంచలనం సృష్టించింది. మహిళల 51 కేజీల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో ఈ నిజామాబాద్‌ జిల్లా బాక్సర్‌ గతంలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నాజిమ్‌ కైజబే (కజకిస్తాన్‌)ను బోల్తా కొట్టించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్‌లో తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. మంగళవారం జరిగిన బౌట్‌లో నిఖత్‌ 5–0తో నాజిమ్‌ను ఓడించింది. నిఖత్‌తోపాటు సరితా దేవి (60 కేజీలు), మనీషా (54 కేజీలు), సిమ్రన్‌జిత్‌ (64 కేజీలు) కూడా సెమీఫైనల్లోకి చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో 37 ఏళ్ల సరితా దేవి 3–2తో రిమ్మా వొలసెంకో (కజకిస్తాన్‌)పై, మనీషా 5–0తో పెటిసియో నైస్‌ జా (ఫిలిప్పీన్స్‌)పై, సిమ్రన్‌4–1తో హా తిన్‌ లిన్‌ (వియత్నాం)పై గెలిచారు.  

శివ థాపా కొత్త చరిత్ర 
పురుషుల విభాగంలో శివ థాపా (60 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), ఆశిష్‌ (69 కేజీలు), సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్‌ ఫైనల్లో శివ 5–0తో రుజాక్రన్‌ జున్‌త్రోంగ్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించాడు. ఈ క్రమంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగోసారి పతకాన్ని ఖాయం చేసుకున్న తొలి భారతీయ బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో శివ 2013లో స్వర్ణం, 2015లో కాంస్యం, 2017లో రజతం సాధించాడు. మిగతా క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆశిష్‌ కుమార్‌ 5–0తో ఒముర్‌బెక్‌ (కిర్గిస్తాన్‌)పై, ఆశిష్‌ 5–0తో త్రాన్‌ డుక్‌ థో (వియత్నాం)పై, సతీశ్‌ 3–2తో దోయోన్‌ కిమ్‌ (కొరియా)పై గెలిచారు. ఓవరాల్‌గా భారత్‌ నుంచి 13 మంది బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. బుధవారం విశ్రాంతి దినం తర్వాత గురువారం సెమీఫైనల్‌ బౌట్‌లు జరుగుతాయి.    

మరిన్ని వార్తలు