గే అయితే తప్పేంటి?: జో రూట్‌

12 Feb, 2019 12:19 IST|Sakshi

సెయింట్‌ లూసియా: ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ మూడో టెస్టులో భాగంగా జో రూట్-షానన్‌ గాబ్రియల్‌ మధ్య వాడివేడి మాటల యుద్ధం జరిగింది. మూడో రోజు ఆటలోఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌-జో డెన్లీలు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో విండీస్‌ పేసర్‌ గాబ్రియల్‌ దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే జో రూట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే గాబ్రియల్‌ చేసిన వ్యాఖ్యలు మైక్‌లో స్పష్టత లేకపోయినప్పటికీ, జో రూట్‌ మాత్రం ‘గే’ అయితే తప్పేంటి అనే సమాధానం ఇవ్వడం మాత్రం రికార్డు అయ్యింది. దీనిపై పోస్ట్‌ మ్యాచ్‌ కాన్పరెన్స్‌లో రూట్‌ మాట్లాడుతూ.. గాబ‍్రియల్ చేసిన వ్యాఖ్యలు తప్పని అనిపిస్తే, అతనే క్షమాపణలు కోరాలి. పలు సందర్బాల్లో ఆన్‌ఫీల్డ్‌ మాటల యుద్ధం అనేది సహజం. కానీ వారు ఏదైతే వ్యాఖ్యానించారో దానికి కట్టుబడి ఉండాలి. అదే సమయంలో క్షమించమని కోరే తత్వం కూడా ఉండాలి’ అని తెలిపాడు. ఈ ఘటనపై క్రికెట్‌ అధికారులకు రూట్‌ ఎటువంటి రిపోర్ట్‌ చేయలేదు.

వెస్టిండీస్‌కు టెస్టు సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ఇంగ్లండ్‌ మూడో టెస్టును సొంతం చేసుకునే ప్రయత్నంలో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి వెస్టిండీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే ఆలౌటైంది. పేసర్‌ మార్క్‌ వుడ్‌ (5/41) కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లతో చెలరేగగా... స్పిన్నర్‌ మొయిన్‌ అలీ 4 వికెట్లతో ప్రత్యర్థిని కూల్చాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌  ఆరంభించిన ఇంగ్లండ్‌ మూడో రోజు ఆట ముగిసేసమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. దాంతో 448 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు