మెరిసిన హరికృష్ణ

3 Dec, 2018 04:11 IST|Sakshi
పెంటేల హరికృష్ణ

 చైనా చెస్‌ లీగ్‌లో రెండు అవార్డులు సొంతం

ఉత్తమ ప్లేయర్, ఉత్తమ విదేశీ ప్లేయర్‌గా ఎంపిక

షాంఘై చెస్‌ క్లబ్‌కు టైటిల్‌ దక్కడంలో కీలకపాత్ర  

సాక్షి, హైదరాబాద్‌: పలువురు మేటి క్రీడాకారులు పాల్గొన్న చైనా చెస్‌ లీగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్, భారత స్టార్‌ చెస్‌ ప్లేయర్‌ పెంటేల హరికృష్ణ అదరగొట్టాడు. చైనాలోని షెన్‌జెన్‌ నగరంలో ముగిసిన ఈ లీగ్‌లో హరికృష్ణ సభ్యుడిగా ఉన్న షాంఘై చెస్‌ క్లబ్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. హరికృష్ణకు ఓవరాల్‌గా ఉత్తమ ప్లేయర్‌ పురస్కారంతోపాటు ఉత్తమ విదేశీ ప్లేయర్‌ అవార్డు కూడా లభించాయి. 12 జట్ల మధ్య 22 రౌండ్లపాటు జరిగిన ఈ లీగ్‌లో షాంఘై క్లబ్‌ 38 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

17 మ్యాచ్‌ల్లో గెలిచిన షాంఘై జట్టు నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ లీగ్‌లో విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’ చేసుకుంటే ఒక పాయింట్‌ కేటాయించారు. హరికృష్ణ మొత్తం 19 గేమ్‌లు ఆడి 16.5 పాయింట్లు సాధించాడు. 14 గేముల్లో గెలిచిన అతను, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. షాంఘై జట్టులో హరికృష్ణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక, మత్లకోవ్‌ మాక్సిమ్‌ (రష్యా), వాంగ్‌ పిన్, ని షికిన్, జు వెన్‌జున్, లూ యిపింగ్, జు యి, ని హువా (చైనా) సభ్యులుగా ఉన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా