వైకల్యం ఓడింది; చేయి లేకపోయినా అధైర్యపడలేదు

2 Sep, 2019 07:12 IST|Sakshi
వివిధ క్రీడల్లో సాధించిన బహుమతులతో మహేష్‌ నాయక్‌ వికలాంగుల క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌గా..

జాతీయస్థాయిలో రాణిస్తున్న గిరిజన తండా యువకుడు

పలు క్రీడల్లో ఉత్తమ ప్రతిభతో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు

త్వరలో జరిగే ‘2020 ఐవాస్‌వరల్డ్‌ గేమ్స్‌’కు ఎంపిక  

థాయ్‌లాండ్‌కు వెళ్లివచ్చేందుకు రవాణా ఖర్చులు భారం

రూ.2 లక్షల సాయం కోసం మహేష్‌ నాయక్‌ ఎదురుచూపులు

శామీర్‌పేట్‌/మూడుచింతలపల్లి: పేదరికం, వైకల్యం అతని ఆత్మవిశ్వాసం ముందు తలవంచాయి. గిరిజన తండా నుంచి జాతీయ స్థాయి క్రీడాకారుడి దాకా అంచలంచెలుగా ఎదిగాడు. ఒంటి చేతితో విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇప్పటికే జాతీయ స్థాయిలో 3 స్వర్ణాలు, 2 రజతాలు, ఓ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్‌ తరఫున థాయ్‌లాండ్‌లోజరగనున్న ఐవాస్‌ పారా వాలీబాల్‌ వరల్డ్‌ గేమ్స్‌కు ఎంపికయ్యాడు మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి మండలం లింగాపూర్‌ తండాకు చెందిన మహేష్‌ నాయక్‌. థాయ్‌లాండ్‌కు వెళ్లేందుకు ఆర్థికపరమైన అడ్డంకులతో కొట్టుమిట్టాడుతున్నాడు. అక్కడికి వెళ్లి రావడానికి రూ.2 లక్షలు అవసరమయ్యాయి. దాతలు సాయపడితే తన ప్రతిభ చాటుతానని మహేష్‌ ధీమా వ్యక్తంచేస్తున్నాడు.

ఆరేళ్ల వయసులోనే చేయి పోగొట్టుకుని..
మహేష్‌ ఆరేళ్ల ప్రాయంలో ఇంటి సజ్జపై నుంచి కిందపడటంతో చేయి విరిగింది. తల్లిదండ్రులు తండాలోని ఓ నాటు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. 3 రోజుల తర్వాత మహేష్‌ చేయి కదలలేనంతగా ఉబ్బిపోయింది. దీంతో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్‌ తీసిన వైద్యులు మహేష్‌ చేతి ఎముక విరిగిందని, అది పూర్తిగా పాయిజన్‌ అయిందని చెప్పారు.  మోచేయి దాకా వరకు తొలగించారు.   

క్రీడల్లో తనదైన ముద్ర..
చేయి లేకపోయినా మహేష్‌ అధైర్యపడలేదు. స్నేహితుల సాయంతో బైక్‌ డ్రైవింగ్‌ నేర్చుకున్నాడు.  కారు, ట్రాక్టర్, లారీ ఇలా వాహనమైనా అలవోకగా నడిపేవాడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ క్రికెట్, వాలీబాల్‌ టోర్నమెంట్‌లు జరిగినా వెళ్లేవాడు. తండా తరఫున జట్టులో చోటు సంపాదించి ప్రతిభ చాటేవాడు. ఒంటిచేత్తో మహేష్‌ నాయక్‌ బాల్‌ని కొడితే బౌండరీ పడాల్సిందే. ఆ ప్రతిభతోనే మహేష్‌నాయక్‌ పలుమార్లు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్‌ జట్టులో పాల్గొన్నాడు.  దివ్యాంగుల భారత క్రికెట్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గానూ ఉన్నాడు. ఇటీవల చైనాలో జరిగిన బీచ్‌ వాలీబాల్‌లో పాల్గొన్నాడు.   

ఒలింపిక్స్‌కి చేరువలో...
2020 ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లో జరిగే ఐవాస్‌ వరల్డ్‌ గేమ్స్‌ వాలీబాల్‌లో మహేష్‌ నాయక్‌ చోటు దక్కించున్నాడు. అక్కడికి వెళ్లేందుకు సుమారు రూ. 2 లక్షలు ఖర్చు అవుతుంది.  ఈ ఐవాస్‌ వరల్డ్‌ గేమ్స్‌లో పాల్గొనేందుకు ముందుగా రూ.లక్షచెల్లించాలి. ఈ క్రీడల్లో విజయం సాధిస్తే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అవకాశం దక్కుతుందని మహేష్‌ నాయక్‌ అంటున్నాడు.  

దాతలు సహకరించాలి
నాలుగేళ్లుగా ఐవాస్‌ గేమ్స్‌లో స్థానం గెలుచుకునేందుకు కష్టపడి ప్రాక్టీస్‌ చేశా. దాతలు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించి నన్ను ఆదుకోవాలి. పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకొస్తా. 2020 టోక్యోలో జరగబోయే పారా ఒలింపిక్స్‌లో చోటు సాధించితీరుతా. – మహేష్‌ నాయక్‌   

మహేష్‌ బ్యాంక్‌ ఖాతా వివరాలు
ధీరావత్‌ మహేష్‌నాయక్, ఖాతా నంబర్‌:3725657961
 ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: సీబీఐఎన్‌ 0285029
సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  
సెల్‌: 96663 91002  

మరిన్ని వార్తలు