అదృష్టం కలిసొచ్చింది...

19 Jan, 2020 02:32 IST|Sakshi

‘లక్కీ లూజర్‌’గా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’లో ప్రజ్నేశ్‌కు చోటు

తొలి రౌండ్‌లో గెలిస్తే రెండో రౌండ్‌లో జొకోవిచ్‌తో ఆడే అవకాశం  

మెల్‌బోర్న్‌: అనుకున్నట్లే జరిగింది. భారత టెన్నిస్‌ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ మెయిన్‌ ‘డ్రా’లో ‘లక్కీ లూజర్‌’గా ప్రజ్నేశ్‌కు చోటు లభించింది. వాస్తవానికి 30 ఏళ్ల ప్రజ్నేశ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ చివరి రౌండ్‌లోనే ఓడిపోయాడు. అయితే ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ ప్రధాన టోర్నమెంట్‌ ‘డ్రా’ విడుదల అయ్యాక ఆ ‘డ్రా’లో ఉన్న ముగ్గురు ఆటగాళ్లు నికోలస్‌ జారీ (చిలీ), కామిల్‌ మజ్‌చార్‌జక్‌ (పోలాండ్‌), అలెక్స్‌ డిమినార్‌ (ఆ్రస్టేలియా) వైదొలిగారు.

దాంతో ఈ మూడు బెర్త్‌లను భర్తీ చేసేందుకు క్వాలిఫయింగ్‌ టోర్నీ చివరి రౌండ్‌లో ఓడిపోయిన ఐదుగురు అత్యుత్తమ ర్యాంక్‌ ఆటగాళ్లకు ‘లక్కీ లూజర్‌’ ‘డ్రా’లో అవకాశం లభించింది. మూడు బెర్త్‌ల కోసం ‘లక్కీ లూజర్‌’ ‘డ్రా’లో ప్రజ్నేశ్‌తోపాటు లొరెంజో గియెస్టినో (ఇటలీ), మిలోజెవిచ్‌ (సెర్బియా), డాన్‌స్కాయ్‌ (రష్యా), కొవాలిక్‌ (స్లొవేకియా) పోటీపడ్డారు. ‘డ్రా’లో ప్రజ్నేశ్, డాన్‌స్కాయ్, కొవాలిక్‌ పేర్లు రావడంతో ఈ ముగ్గురికి ‘లక్కీ లూజర్స్‌’గా ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’లో ఆడే అవకాశం లభించింది. తొలి రౌండ్‌లో ప్రపంచ 144వ ర్యాంకర్‌ టట్‌సుమా ఇటో (జపాన్‌)తో ప్రజ్నేశ్‌ ఆడతాడు. ఒకవేళ తొలి రౌండ్‌లో ప్రజ్నేశ్‌ గెలిస్తే రెండో రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్, ఏడుసార్లు ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచిన నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) ఎదురయ్యే అవకాశముంది.

>
మరిన్ని వార్తలు