వీల్‌చైర్‌ నుంచే విజయ బావుటా..

31 Dec, 2017 12:21 IST|Sakshi

ఊహ తెలియని వయసులో వైకల్యం కాటేసింది. ఒక్క కాలితోనే పాఠశాలకు వెళ్లేది. అందరూ ఉత్సాహంగా ఆటలు ఆడుతుంటే సంతోషంగా చూసేది. క్రమంగా తాను వారికంటే మేటిగా ఆడాలని కలలు కంది, సాధనతో ఆ స్వప్నాల్ని సాకారం చేసుకుంది. చక్రాల కుర్చీ క్రీడాకారిణి ప్రతిమారావు తనవంటివారికి ఆదర్శంగా నిలిచారు. 

సాక్షి, శివాజీనగర(బెంగళూరు): దేవుడు ఒక ద్వారం మూసేస్తే మరో ద్వారం ఎక్కడో తెరిచే ఉంటాడు అని ప్రతిమారావు తన బాల్యంలో విన్న మాటలు. చేయాల్సిందల్లా ఆ మార్గాన్ని వెతుక్కో వడమే అంటారు బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల వీల్‌చైర్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ప్రతిమారావు. ఆమెకు మూడేళ్ల వయసులో పోలియో ఇంజెక్షన్‌ వేసినప్పుడు అది రియాక్షన్‌ కావడంతో కుడి కాలును పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. 

ఆమె క్రమంగా క్రీడాకారిణిగా మారి నేడు వీల్‌చైర్‌ టెన్నిస్‌లో ఏఐటీఏ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచారు. ఉడుపి జిల్లా వద్ద సాలిగ్రామానికి చెందిన ప్రతిమా కంప్యూటర్‌ డిప్లొమా చేసి జీవీకే ఇఎమ్‌ఆర్‌ఐ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తండ్రి సాధారణ పాన్‌ వ్యాపారి. ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ‘నన్ను ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచారు. పాఠశాలలో నేను ఆటలకు దూరంగా ఉండేదాన్ని. టీచర్‌ పక్కన కూర్చొని ఇతరుల ఆటలను చూస్తూ ఉండేదాన్ని. అయితే బెంగళూరుకు వచ్చిన తరువాత నాకు టెన్నిస్‌లో ఆసక్తి పెరిగింది. వీల్‌చైర్‌లో టెన్నిస్‌ ఆడటాన్ని చూసి నాకూ ఉత్సాహం కలిగింది.’ అని అనుభవాలను పంచుకున్నారు. 

 సాధించాలనే తపనే ఇక్కడ నిలిపింది 
పోలియో ఇంజక్షన్‌ను సరిగా వేయకపోవడంతో తన కుడి కాలును కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ, నాన్నకు తాను కష్టపడటం ఇష్టం లేదు, వారితో సంతోషంగా ఉండాలనే ఆశ ఉండేది అన్నారు. ‘అయితే నాకు ఏదైనా సాధించాలని ఆత్మ విశ్వాసం ఉంది. చక్రాల కుర్చీ ఉపయోగించకుండా నేను నడవగలను. దూరంగా నడవాలంటే మాత్రం క్యాలిఫర్‌ ఉపయోగిస్తా. అయితే టెన్నిస్‌ ఆడాలనే ఆసక్తితో తొలిసారిగా చక్రాలకుర్చీని ఉపయోగించడం నేర్చుకున్నా. 2012లో కర్ణాటక వీల్‌చైర్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ (కేడబ్ల్యూటీ)ద్వారా అడేందుకు ఆవకాశం దక్కింది. దీనిద్వారా కర్ణాటక రాష్ట్ర లాన్‌ టెన్నిస్‌ సంస్థ (కేఎస్‌ఎట్‌టీఎ) మైదానంలో ప్రతి వారాంతం సాధన చేసేదాన్ని. 

గూగుల్, యూట్యూబ్‌లో చూసి టెన్నిస్‌ శిక్షణ 
గూగుల్, యూ ట్యూబ్‌లో వీడియోలు చూస్తూ టెన్నిస్‌ ఆడటాన్ని నేర్చుకున్నా. 2013లో జాతీయ వీల్‌చైర్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌ చేరుకున్నాను’ అని ప్రతిమారావు తెలిపారు.  ‘ఆ తరువాత కోచ్‌ నిరంజన్‌ రమేశ్‌ ద్వారా శిక్షణ లభించింది. ఆయనే నా గురువు. సమయ పాలనతో పాటు వృత్తి జీవిత పలు క్రమశిక్షణలను నేర్పించారు. ఆ తరువాత ఏఐటీఏ ర్యాంకింగ్‌లో ఆగ్రస్థానం లభించింది. ఐటీఎఫ్‌ ర్యాంకింగ్‌లో ప్రస్తుతానికి ఏ స్థానం లభించలేదు. అందులో ర్యాంకింగ్‌ సాధించడమే నా ఏకైక లక్ష్యం’ అని చెప్పారు. 

 ప్రతిమారావు సాధనలు.. 
 ప్రతిమారావు కర్ణాటక రాష్ట్ర లాన్‌ టెన్నిస్‌ సంస్థ ఇటీవల జరిపిన టిబెబుయియా ఓపెన్‌ వీల్‌చైర్‌ టెన్నిస్‌ టోర్నీలో మహిళల విభాగంలో విజేతగా నిలిచారు. 
 2015లో మలేషియా ఓపెన్‌ టోర్నీలో సెమిఫైనల్‌ వరకూ వెళ్లారు. 
 2016లో ఆర్‌వైటీహెచ్‌ఎమ్‌ 4వ జాతీయ వీల్‌చైర్‌ చాంపియన్‌షిప్‌లో సింగిల్, డబుల్స్‌లో రన్నరప్‌. 
 2016 కేడబ్ల్యూటీఏ రాష్ట్రస్థాయి టెన్నిస్‌లో సింగిల్స్, డబుల్స్‌లో చాంపియన్‌. 
 2016 టెబెబుయియా ఓపెన్‌ టోర్నీలో సింగిల్స్, డబుల్స్‌లో విజేత. 
 2017 మరినా ఓపెన్‌ టోర్నీలో సింగిల్స్‌ ట్రోఫీ. 

 

మరిన్ని వార్తలు