లేటుగా వచ్చినా.. లేటెస్టు హ్యాట్రిక్

6 May, 2014 14:04 IST|Sakshi
లేటుగా వచ్చినా.. లేటెస్టు హ్యాట్రిక్

35-40 ఏళ్లు.. రాజకీయాల్లో అయితే నవ యవ్వనం.. క్రికెట్లో అయితే రిటైర్మెంట్ వయసు. సమకాలీన క్రికెట్లో క్రమశిక్షణతో పాటు ఫిట్నెస్ కాపాడుకుంటే అతికష్టమ్మీద 40 వరకూ లాక్కురావచ్చు. అయితే ఒక్కోసారి ఎవరూ ఊహించని అద్భుతాలు జరుగుతుంటాయి. ఓ ముంబైకర్ రిటైర్మెంట్ వయసులో అరంగేట్రం చేశాడు. భారత క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కానీ రికార్డు నెలకొల్పాడు. అతనే రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ప్రవీణ్ విజయ్ తాంబె. ఐపీఎల్-7లో లేటు వయసులో సంచలనాలు సృష్టిస్తున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో రెండు బంతుల్లో హ్యాట్రిక్ వికెట్ తీసి.. టి-20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా ఘనత సాధించాడు. తాంబె కథేంటో తెలుసుకుందాం..

తాంబె మన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే రెండేళ్లు ముందు 1971 అక్టోబర్ 8న ముంబైలోనే జన్మించాడు. ప్రస్తుతం తాంబె వయసు 43 ఏళ్లు. విశేషమేంటంటే.. మన మాస్టర్ ఏమో ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు కొల్లగొట్టి గతేడాది చివర్లో 41 ఏళ్ల వయసులో క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. తాంబె మాత్రం  41 ఏళ్ల వరకూ ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఐపీఎల్ సరేసరి. ముంబైలో కేవలం ఓ 'బి' టీమ్కు కెప్టెన్గా వ్యవహరించాడు. అలాంటి తాంబెకు గతేడాది అనూహ్యంగా ఐపీఎల్లో ఆడే అవకాశం వచ్చింది. అదీ ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడకుండానే. గత సీజన్ల్లో తాంబె తన 42 వ ఏటన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరిగిన ఆ మ్యాచ్లో వికెట్ల బోణీ కొట్టలేకపోయాడు. కాగా ఐపీఎల్-6లో 14 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. దీంతో రంజీల్లో ఆడే అవకాశం వచ్చింది. సచిన్ రిటైరయిన తర్వాత గత డిసెంబర్లో ముంబై తరపున తొలి మ్యాచ్ ఆడాడు. అందరూ దేశవాళ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో రాణించి ఐపీఎల్ చాన్స్ కొట్టేస్తే.. తాంబే మాత్రం రివర్స్ రూట్లో వచ్చాడన్నమాట.

తాజా సీజన్లో అయితే తాంబె బంతితో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. రాజస్థాన్ తరపున ఏడు మ్యాచ్లు ఆడిన తాంబె 12 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-7లో స్టెయిన్, మలింగ వంటి దిగ్గజ బౌలర్లు ఆడుతున్నా.. ఇప్పటిదాకా అత్యధిక వికెట్లు తీసిన ఘనత మాత్రం అతనిదే. క్రికెట్లో మాస్టర్ ఓ అద్భుతమైతే.. మరో ముంబైకర్ తాంబె కూడా మరో అద్భుతం.

>
మరిన్ని వార్తలు