ఓవరాల్‌ చాంపియన్‌ ప్రీతి

29 Jul, 2019 09:54 IST|Sakshi

మాన్‌సూన్‌ రెగెట్టా జాతీయ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: మాన్‌సూన్‌ రెగెట్టా జాతీయ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌కు చెందిన సెయిలర్‌ ప్రీతి కొంగర రికార్డు ప్రదర్శనతో అదరగొట్టింది. పలువురు మేటి సెయిలర్లు పాల్గొన్న ఈ జాతీయ స్థాయి టోర్నీలో ఏకంగా మూడు టైటిళ్లతో ఆమె సత్తా చాటింది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ప్రీతి 34 పాయింట్లతో ఓవరాల్‌ చాంపియన్‌ ట్రోఫీని అందుకోవడంతో పాటు బాలికల విభాగంలోనూ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను, ఉత్తమ సెయిలర్‌ ట్రోఫీలను గెలుచుకుంది. ఓవరాల్‌ కేటగిరీలో ప్రీతి, రితిక డాంగి (61 పాయింట్లు), విజయ్‌ కుమార్‌ (67 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో ప్రీతి, రితిక డాంగి (61 పాయింట్లు) తొలి రెండు స్థానాలను దక్కించుకోగా... ఉమా చౌహాన్‌ (78 పాయింట్లు) మూడోస్థానంతో సరిపెట్టుకుంది.

బాలుర కేటగిరీలో విజయ్‌ కుమార్‌ 67 పాయింట్లతో చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. రాజ్‌ విశ్వకర్మ (118 పాయింట్లు) రన్నరప్‌గా నిలిచాడు. అక్షయ్‌ (118 పాయింట్లు) మూడోస్థానంతో టోర్నీని ముగించాడు. ఆప్టిమిస్ట్‌ లైట్‌ ఫ్లీట్‌ బాలికల కేటగిరీలో మౌనిక (వైసీహెచ్‌), బాలుర విభాగంలో సోమనాథ్‌ రాథోడ్‌ (వైసీహెచ్‌), డెబ్యూటెంట్స్‌ కేటగిరీలో కె. రాజేశ్వరి టైటిళ్లను అందుకున్నారు. ఆరు రోజుల పాటు హుస్సేన్‌సాగర్‌లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 131 మంది సెయిలర్లు సందడి చేశారు. ఈ పోటీల న్యాయనిర్ణేతగా ఆస్ట్రేలియాకు చెందిన మార్క్‌ రికే వ్యవహరించారు. ముగింపు కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్, హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌ అధ్యక్షుడు, కోచ్‌ సుహేమ్‌ షేక్‌ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు.   

మరిన్ని వార్తలు